Kalvakuntla Kavitha : కవిత కోపం అంతా హరీశ్ రావు పైనే.. ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్
కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి తనను సస్పెన్షన్ చేస్తూ నిన్న ఒక ప్రకటన వచ్చిందని కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో ఐదు నెలలు వచ్చిన తర్వాత పార్టీ కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని కవిత తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ కు నోటీసులు, మహిళలకు 2,500 ఇవ్వాలని పోస్టుకార్డు ఉద్యమం, పింఛన్ల మొత్తం పెంచాలని తాను కార్యక్రమాలను చేపట్టానని కల్వకుంట్ల కవిత తెలిపారు. పలు ప్రజా సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టామని కవిత తెలిపారు. నవంబరు 2024 నుంచి బీఆర్ఎస్ కండువా కప్పుకుని తాను అనేక కార్యక్రమాలు చేపట్టానని, కానీ ఇవి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలని తాను భావించడం లేదని కవిత తెలిపారు.
తాను చేసిన పోరాటాలు...
తాను బీసీలకు రిజర్వేషన్ పై పోరాటం చేస్తుంటే తనపై లేనిపోని వార్తలు రాయించి తనపై నిందలు వేయించారని అన్నారు. తనకు జన్మనిచ్చిన తండ్రి, ఆయన చిటికెన వేలు పట్టుకుని ఉద్యమంలోకి అడుగుపెట్టిన తాను, ఆయన స్ఫూర్తితోనే రాజకీయాలను నేర్చుకున్నానని, ఆయన స్ఫూర్తితోనే తాను బీసీ నినాదం అందుకున్నానని, అందుకే సామాజిక తెలంగాణ అని నినదించానని అన్నారు. నిన్న తాను చెప్పిన ఇద్దరు నేతలు పని గట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు. హరీశ్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతదా? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తాను తెలంగాణ భవన్ లో కూర్చుని తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పానని, రామన్నను భుజం పట్టుకుని ఒక అన్నగా అడిగానని, తనపై దుష్ప్రచారం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ ను కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
హరీశ్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ....
కేసీఆర్ నుంచి తనకు కబురు వస్తుందని తనకు నమ్మకం లేదని, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి స్పందన రాకపోవడంతో ఇక సాధారణ మహిళా కార్యకర్తకు అన్యాయం జరిగితే చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు. నిన్న మహిళ నేతలందరూ తనపై మాట్లాడిన తీరు తనకు ఆనందం కలిగించిందన్నారు. తనది, కేసీఆర్, కేటీఆర్ రక్తసంబంధమని, ఎవరైతే వ్యక్తిగత లాభం పొందాలనుకున్న వారు ఉన్నారో అందులో భాగంగా మొదటి అడుగులో తనను బయటకు పంపారని కల్వకుంట్ల కవిత అన్నారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోవాలని కేసీఆర్ ను కవిత కోరారు. రేపటి నాడు ఇదే ప్రమాదం కేటీఆర్, కు తర్వాత కేసీఆర్ కు రావచ్చని అన్నారు. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హరీశ్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే విమానంలో ప్రయాణించినప్పుడే ఈ కుట్రలు మొదలయ్యాయని కల్వకుంట్ల కవిత అన్నారు.
వచ్చిన ఆరోపణలు...
పాల వ్యాపారంపై వచ్చిన ఆరోపణలు వచ్చి మాయమయ్యాయని కవిత అన్నారు. రంగనాయక్ సాగర్ వద్ద ఫామ్ హౌస్ పై హెడ్డింగ్ వస్తుందని, తర్వాత కనిపించిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని, కింద స్థాయిలో అమలు చేయాల్సింది హరీశ్ రావు అనేనని, తాను కేటీఆర్ ను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానని, వారు మన మంచి కోరుకునే వారు కారని, నాన్న కు చెడ్డ పేరు వచ్చిందంటే అది హరీశ్ రావు వల్లనే వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల తర్వాత పార్టీలోకి హరీశ్ రావు వచ్చారని, గతంలో వైఎస్ ను కలిశారని, హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదని, బబుల్ షూటర్ అని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అంతర్గతంగా బీజేపీ నేతలతో మాట్లాడి ఒక పేరు ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. హరీశ్ రావు ట్రబుల్ క్రియేట్ చేసి దానిని తొలగించినట్లు ప్రయత్నిస్తారన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీశ్ రావు అరవై లక్షలు పంపాడని కవిత ఆరోపించారు. హరీశ్ రావు వల్ల జగ్గారెడ్డి నుంచి మొదలుపెడితే ఈటల రాజేందర్ వరకూ పార్టీని విడిచి వెళ్లడానికి హరీశ్ రావు కారణమని కవిత మండిపడ్డారు.