Jubilee Hills bye Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఆంధ్ర పార్టీల క్యాడర్ ఎటువైపు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుంది.

Update: 2025-11-03 12:24 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే టీడీపీ, జనసేన కు చెందిన ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయి. టీడీపీకి ఇక్కడ ఓటు బ్యాంకు ఉంది. అదే సమయంలో జనసేన కు చెందిన క్యాడర్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీలకంగా మారనుంది.

కూటమిలో ఉండటంలో
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో మూడు పార్టీలు కలసి పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. జనసేన కూడా పోటీ చేయలేదు. అలాగని బీజేపీకి ప్రత్యక్షంగా ఇప్పటి వరకూ మద్దతు ప్రకటించలేదు. దీంతో ఈ రెండు పార్టీలకు చెందిన ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది రాజకీయంగా చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో సెటిలర్లు కూడా ఎక్కువగా ఉండటంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా అధికంగా ఉండటంతో వారు ఈ ఎన్నికలలో కీలకమని అందరికీ తెలిసిందే. వీరి ఓట్ల కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వారు మాత్రం గుంభనంగానే ఉన్నారు.
మూడు పార్టీలూ తమవేనని...
టీడీపీ బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణం, ఆయన సతీమణి సునీతకు అప్పగించడంతో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తమకే వస్తాయని బీఆర్ఎస్ భావిస్తుంది. మరొకవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలుండటంతో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని హస్తం పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ ఎటూ కూటమిలోని పార్టీ కాబట్టి ఆ ఓట్లు తమవేనన్న దీమాలో ఉంది. జనసేన క్యాడర్ అయితే నందమూరి బాలకృష్ణ, చిరంజీవిల మధ్య తలెత్తిన వివాదంతో ఎటువైపు వెళతారన్నది ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏపీ పార్టీల ప్రభావం ఎంతో కొంత చూపుతుందంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందన్నది.


Tags:    

Similar News