Summer Effect : అవసరమైతే తప్ప బయటకు రాకండి.. ఎండలు మండిపోతున్నాయ్

ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో గత రెండు రోజులుగా ఎండలు మరింత ఎక్కువయ్యాయి.

Update: 2025-02-18 04:42 GMT

ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో గత రెండు రోజులుగా ఎండలు మరింత ఎక్కువయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 15వ తేదీ నుంచి ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వేడి గాలులతో పాటు 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఉదయం పది గంటలు దాటితే బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. నిన్న మొన్నటి వరకూ చలితో ఇబ్బంది పడిన ప్రజలు నేడు ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో రోడ్డుపైకి వచ్చేందుకు జంకుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు కూడా డోర్ డెలివరీ చేయించుకునే పరిస్థితికి ఫిబ్రవరిలోనే వచ్చింది.

రెండో వారం నుంచే...
ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా శివరాత్రికి చలి తీవ్రత తగ్గి క్రమంగా మార్చి మూడో వారం నుంచి ఎండలు ప్రారంభమవుతాయి. కానీ ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండల తీవ్రత పెరగడంతో పాటు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఎండల దెబ్బకు ఇప్పటికే అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులు, కళ్లుమంటలు వంటి వాటితో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారుల ఇంటి వద్దనే ఉండటం మంచిదని, వీలయినంత వరకూ బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
గరిష్ట ఉష్ణోగ్రతలు...
నిన్న తెలంగాణలో 37.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.6 డిగ్రీల మేరకు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాచలం వంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న అత్యధికంగా కామారెడ్డి జిల్లాలోని పిట్లంలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు. మార్చి పదిహేనో తేదీ నుంచి మరింతగా ఎండలు ముదురుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నాు. ఇప్పటికే ఉక్కపోత ప్రారంభమయింది. ఫ్యాన్లు, ఏసీలు ఆన్ చేయక తప్పడం లేదు. విద్యుత్తు వినియోగం కూడా గరిష్టానికి చేరుకుందని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు.
.


Tags:    

Similar News