Summer Effect : రోడ్లన్నీ ఖాళీగానే.. కర్ఫ్యూ విధించినట్లే.. బయటకు వస్తే మల మల మాడిపోవాల్సిందే

తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి

Update: 2024-05-01 05:56 GMT

తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. నల్లగొండ, ఖమ్మం వంటి ప్రాంతాల్లో నిన్న 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఎండల తీవ్రత కారణంగా ఎనిమిది మంది ఇప్పటి వరకూ మరణించారని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎండల తీవ్రతతో పాటు వేడిగాలులకు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే తెలంగాణలో ఎండతీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఎండల తీవ్రత ఎలా ఉందంటే... నడిరోడ్డు మీద దోసె వేసేటంత స్థాయిలో ఎండల తీవ్రత ఉందంటే ఆశ్యర్యపోక తప్పదు.

వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా...
గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రహదారులన్నీ ఉదయం నుంచే బోసి పోయి కన్పిస్తున్నాయి. కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత మాత్రమే ప్రజలు బయటకు వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. చిరు వ్యాపారులు కూడా ఉదయం ఆరు గంటలకే తమ దుకాణాలను తెరుస్తున్నారు. ఎవరైనా నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేయాలంటే ఉదయం ఏడు గంటల లోపే బయటకు వచ్చి వెళుతున్నారని, అందుకే తాము కూడా వేళలను మార్చుకున్నామని తెలిపారు.
రాత్రి పూట కూడా...
రాత్రి పూట కూడా ఉక్కపోత వీడటం లేదు. వేడి గాలులతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. మే నెల గడిచేదెట్లా? అని ఆందోళన చెందుతున్నారు. అనేక మంది ఇప్పటికే వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు కూడా ఉంటుండటంతో వైద్యులను సంప్రదిస్తున్నారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మే నెలలోకి ఎంటర్ అవడంతో ఎండలు మరింత ముందిరే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Tags:    

Similar News