Telangana : తెలంగాణ తడిసి ముద్దయింది.. లోతట్లు ప్రాంతాల్లోకి చేరిన నీరు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి మొదలయిన వర్షం ఇంకా వదలలేదు.

Update: 2025-08-12 04:35 GMT

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి మొదలయిన వర్షం ఇంకా వదలలేదు. హైదరాబాద్ నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వరంగల్ నగరం...
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం నీటమునిగింది. వరంగల్, హనుమకొండలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వాహనాలన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. రాత్రి నుంచి కుండ పోత వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లలోకి చేరిన నీరును బయటకు పంపించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. తిండి ధాన్యాలు కూడా వర్షపు నీటికి తడిసిపోయాయని ఆవేదన చెందుతున్నారు. రాత్రి నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ అధికారులు తమ వద్దకు రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరెంజ్ అలెర్ట్ జారీ...
తెలంగాణలో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, జగిత్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప మానుకోవాలని సూచించింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు పొంగిపొరలుతుండటంతో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో భారీ వర్షాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొనసాగించాల్సిన సహాయక చర్యల గురించి టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. మొత్తం మీద తెలంగాణ తడిసి ముద్దవుతుంది.



Tags:    

Similar News