Kalvakuntla Kavita: కేసీఆర్ చుట్టూ దెయ్యాలు: కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ హాట్ టాపిక్ గా నిలవగా.. ఆమె ఎయిర్ పోర్టులో చేసిన వ్యాఖ్యలు అంతకు మించి హాట్ టాపిక్ అయ్యాయి. అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ లో కోవర్టులను పక్కకు తప్పించాల్సిన అవసరం ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్నారు. రెండు వారాల క్రితం తాను కేసీఆర్‌కు లేఖ రాశానని, గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్‌కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పానన్నారు. నాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో.. ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటని కవిత చర్చించారు. లేఖ బయటకు రావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని ఎద్దేవా చేశారు.