బాత్ రూమ్ నుండి బంగారం దుకాణంలోకి
సూర్యాపేటలోని ఓ బంగారం దుకాణంలో దొంగతనం జరిగింది.
సూర్యాపేటలోని ఓ బంగారం దుకాణంలో దొంగతనం జరిగింది. 7 కోట్లకు పైగా విలువైన 18 కిలోల బంగారు ఆభరణాలను, సుమారు 18లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని సాయి సంతోషి నగల దుకాణం వెనుక ఉన్న బాత్‌రూం గోడకు రంధ్రం చేసి దొంగలు లోపలికి ప్రవేశించారు. లాకర్ గది ఇనుప షట్టర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు. లాకర్ గదిలోకి ప్రవేశించి అందులోని బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి ముందు దొంగలు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. షాప్ వెనుక నిర్మానుష్య ప్రాంతం నుంచి లోపలికి చొరబడ్డారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.