K.Kesava Rao : కేశవరావు కాంగ్రెస్ లో ఉన్నారా? లేరా? క్యాడర్ లోనే అనుమానం

మాజీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అన్న సందేహం కలుగుతుంది

Update: 2025-06-21 12:21 GMT

మాజీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కాంగ్రెస్ లో ఉన్నారా? లేరా? కేవలం కుమార్తె పదవి కోసమే ఆయన పార్టీ మారినట్లు కనపడుతుంది. ఉన్న రాజ్యసభ పదవి పోయింది. ఏదో కేబినెట్ హోదా పదవి ఇచ్చారు కానీ కేకే కు బీఆర్ఎస్ లో ఉన్నంత ప్రాధాన్యత లేదని స్పష్టంగా అర్థమయింది. కేవలం తన కుమార్తె మేయర్ పదవిని నిలబెట్టుకోవడం కోసమే కేకే పార్టీ మారినట్లు అర్థమవుతుంది. ఆయనకు ఈ వయసులో కావాల్సింది తనకు పదవులు కాదు. తన వారసులు రాజకీయంగా నిలదొక్కుకోవడమే. అందుకే రాజ్యసభ చాలా రోజులు పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశారు. తర్వాత ఇప్పుడు కేకే కామ్ గానే ఉన్నారు. కుమార్తె మేయర్ పదవి మాత్రం క్షేమంగా ఉండటం ఒకరకంగా ఊరటఅయినప్పటికీ ఆయన చేసిన పని సరైనదేనా? అన్నది చర్చనీయాంశమైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి...
జర్నలిస్టుగా ఉన్న కే కేశవరావు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లోనే ఎక్కువ కాలం గడిచింది. అనేక పదవులు కూడా పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కూడా సామాజికవర్గం కోణంలో ఆయనకు రాజకీయంగా నాడు కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ లో మంచి ప్రిఫెరెన్స్ ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కేకే బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు దగ్గరయ్యారు. . కేసీఆర్ కూడా కేకేకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. పార్టీలో కీలక పదవి అప్పగించడమే కాకుండా ముఖ్యమైన విషయాలను కేకేకు కేసీఆర్ అప్పగించేవారు. దీంతో పాటు పదేళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉన్న కె. కేశవరావు రెండు సార్లు రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు.
అధికారం కోల్పోయిన వెంటనే...
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. మ్యానిఫేస్టో కమిటీ నుంచి పార్టీలో ప్రధాన బాధ్యతలను కూడా కేశవరావుకు కేసీఆర్ అప్పగించారు. పార్టీలో సెక్రటరీ జనరల్ ను చేశారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. అలా అన్ని రకాలుగా కేసీఆర్ కేకేను అందలం ఎక్కించారు. అంతేకాదు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగితే ఆయన కుమార్తె విజయలక్ష్మికి మేయర్ గా నియమించారు. అలాంటి కేశవరావు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే జెండా మార్చేశారు. కారణం ఏదీ చెప్పకపోయినా, చెప్పలేనంత కారణాలు లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే కే కేశవరావు పార్టీ మారినట్లు నాడు స్పష్టంగా అర్థమయింది. ఎందుకంటే రాజ్యసభ పదవికి రాజీనామా చేసి పార్టీ మారాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ సలహాదారుగా నియమించినా...
కానీ కుమార్తె మేయర్ పదవి కోసమేనని అందరికీ అర్థమయింది. రాజ్యసభ పదవిని త్యాగం చేసినందుకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావను ప్రభుత్వం నియమించింది. కేకేకు కేబినెట్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే కె.కేశవరావును నామినేటెడ్ పోస్టులో ప్రభుత్వం నియమించింది. కానీ కేకే పార్టీలో చేరిన నాటి నుంచి పెద్దగా యాక్టివ్ గా పార్టీలో కనిపించడం లేదు. అస్సలు కాంగ్రెస్ లో కేకే ఉన్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తరచూ మీడియా ముందు కనిపించే కే కేశవరావు అసలు కెమెరాలవైపు కూడా చూడటం లేదు. ఆయన అనుకున్న లక్ష్యం కుమార్తె పదవిని కాపాడుకోవడమే. అది మాత్రం నెరవేరింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనను గుర్తించడం లేదన్నది వాస్తవం. ఇటీవల కేసీఆర్ ను పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎటు వైపు తీసుకెళతాయన్న చర్చ జరుగుతుంది.


Tags:    

Similar News