కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు : మంత్రి వేముల

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 న పథకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశం తో ఉత్సవాలు ప్రారంభమై..

Update: 2023-05-27 14:08 GMT

telangana decade celebrations

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 9 సంవత్సరాలు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, సంక్షేమంలో, అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ గా ఎదిగిందని కొనియాడారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి, ఎన్నో కొట్లాలను నెగ్గి తెచ్చుకున్న తెలంగాణలో 9 ఏళ్లకాలంలో ఎన్నో అద్భుతాలు సృష్టించామన్నారు. రాష్ట్రంలో హనుమంతుడు లేని గుడి, కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇళ్లు ఉండవన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో పోడు పట్టాలు, గొర్రెల పంపిణీ, న్యూట్రిషన్ కిట్లు, హరిత హరం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 న పథకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశం తో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ,అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ముగియనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా, తెలంగాణ ప్రగతి ప్రతిఒక్కరికీ తెలిసేలా చాటిచెప్పాలని మంత్రి వేముల సూచించారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్య కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు- మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని పేర్కొన్నారు. కామారెడ్డికి మెడికల్ కాలేజ్, బాన్సువాడలో నర్సింగ్ కళాశాల, వివిధ ప్రాంతాల్లో వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీటి చెరువుల పునరుద్ధరణ, గ్రామాల్లో చెక్ డ్యాములు, ఊట చెరువుల నిర్మాణం తో భూగర్భ జలాలు పెరిగాయని మంత్రి తెలిపారు. రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు విద్యుత్ వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని గర్వాగా చాటుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని, ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు, రైతు భీమా, వివిధ రకాల పెన్షన్లు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన పనుల వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయించారని తెలియజేశారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అందజేయాలని సూచించారు. 4, 480 మంది రైతులకు 12,969 ఎకరాలు పోడు పట్టాలు గిరిజనులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత గల వారికి ఇంటి స్థలాల పట్టాలు అందజేయాలని తెలిపారు.


Tags:    

Similar News