Congress : జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా?
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను థిక్కరించిన వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమయినట్లు తెలిసింది
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను థిక్కరించిన వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమయినట్లు తెలిసింది. కొందరిని పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీగా రెబల్స్ గా నిలిచిన వారిపై పార్టీ బహిష్కరణ వేటు వేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు కొందరిపై చర్యలకు సిద్ధమయింది. అయితే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి అనుకూల వర్గం, అలా కుదరదంటూ మరొక వర్గం తమ వాదనలను వినిపిస్తున్నారని తెలిసింది.
రెండు వర్గాలుగా...
జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీచైర్మన్ సరితా తిరుపతయ్య యాదవ్ తో పాటు వివిధ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో రెబెల్స్ గా నిలిచిన వారిపై బహిష్కరణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సస్పెన్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. జీవన్ రెడ్డిని ఇప్పటికే తీవ్రంగా అవమానించామని, పార్టీనే నమ్ముకుని ఉన్న జీవన్ రెడ్డిని పార్టీ మారి వచ్చిన ఒక ఎమ్మెల్యే కోసం బహిష్కరించాలనుకోవడం సరికాదని కొందరు వాదిస్తున్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొందరరు కాంగ్రెస్ నేతలు, మంత్రులు అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు. జీవన్ రెడ్డిని పిలిచి మాట్లాడాల్సిందని అంటున్నారు.
వేటు తప్పదంటూ...
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వేటు తప్పదు రేవంత్ వర్గం వాదిస్తుంది. జీవన్ రెడ్డి విషయంలో రెండుగా చీలిన కాంగ్రెస్ నేతలు ఈ పంచాయతీని హైకమాండ్ వద్దకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. జగిత్యాలలో దాదాపు 20, గద్వాలలో ఏడు స్థానాల్లో పోటీలో రెబెల్స్ నిలిచారు. ఆర్మూరు మున్సిపల్ బరిలో రెబల్స్ గా నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోటీలో ఉన్నారు. కరీంనగర్ నగర్ జిల్లా రాయికల్ మున్సిపాలిటీలోనూ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సంగారెడ్డి మరియు సదాశివపేట మున్సిపాలిటీలలో రెబెల్స్, అసంతృప్తుల తో పాటు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినందుకు కొందరిపై యాక్షన్ కు సిద్ధమయినట్లు సమాచారం.