సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ : రేవంత్ రెడ్డి

సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2026-03-30 12:16 GMT

సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారని, కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదన్నారు.రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారన్న రేవంత్ రెడ్డి రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందని చెప్పారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీ చట్టం తీసుకొచ్చిందని, రూపాయి కిలో బియ్యం పథకం విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని, కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తరువాత ఎన్టీరామారావు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లారని, అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు.

రైతుల్లో అవగాహన కల్పించి...
రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని, నలభై ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోందని, ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారని, దొడ్డు బియ్యం తినేవారు లేక ఆ బియ్యాన్ని సన్ననియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందన్న రేవంత్ రెడ్డి దొడ్డు బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి ఖర్చు తప్ప… పేదలకు ఉపయోగపడటం లేదని గ్రహించామని, అందుకే పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామని తెలిపారు. ఇందుకోసం రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించి సన్నవడ్లు పండించాలని ప్రోత్సహించామని, 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, భవిష్యత్ లో ఇది 90 శాతం కూడా కావచ్చని, అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు అందించామని, రైతులకు లాభం చేకూర్చడమే కాదు.. పేదల ఆకలి తీరుస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందని, పౌరసరఫరాల మంత్రి, శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైందని, నేటితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందని, అందుకే వరి ఒక్కటే కాదు… ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నామన్న రేవంత్ రెడ్డి వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.


Tags:    

Similar News