Cold Winds : దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలిగాలులు పెరగడంతో?

తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రాత్రి నుంచి ప్రారంభమైన చలిగాలులుపది గంటలయినా వీడటం లేదు.

Update: 2023-12-31 03:04 GMT

తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రాత్రి నుంచి ప్రారంభమైన చలిగాలులు తెల్లవారి పది గంటలయినా వీడటం లేదు. చలిగాలులు దెబ్బకు జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పాటు ఉదయాన్నే పొగమంచు కూడా ఉండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయి. ఉదయం 9 గంటల వరకూ వాహనాలను బే లలో నిలిపివేసి ప్రయాణాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసుకుంటే మంచిదని పోలీసులు చెబుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై నిలిచిఉన్న భారీ వాహనాలను ఢీకొట్టి అనేక మంది మరణిస్తున్నారని, జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు.

వ్యాధులు సంక్రమించేందుకు...

న్యుమోనియా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చలిగాలుల్లో మార్నింగ్ వాక్ కు కూడా వెళ్లవద్దని సూచిస్తున్నారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఎవరూ బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చలిగాలుల తీవ్రత కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశముందని చెబుతున్నారు. జలుబు, దగ్గు వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో...
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకు జిల్లాలోని మినుమలూరులో పది డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం భీం సిర్పూర్ లో 11.2 డిగ్రీలు, సొనాలలో 10.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని పెంబిలో 12.8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా నిల్వాయిలో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News