Weather Report : చెవులు దిమ్మెరపోతున్నాయి సామీ.. చలి తగ్గడంపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్
రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది
రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. తగ్గుతుందనుకుంటుంటే మాత్రం మరింత పెరుగుతుంది. దేశంలో చలిగాలుల తీవ్రత రాను రాను ఎక్కువవుతుందని భారత వాతావరణ శాఖ కూడా చెబుతుంది. అలాగే కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దక్షిణాదిలోనూ చలి దంచికొడుతుంది. గత ఏడాది ఎండల తీవ్రతతో మాడు పగిలిపోయింది. ఈసారి చలితీవ్రతతో చెవులు దిమ్మర పోతున్నాయి. అలాగే అకాల వర్షాలు కూడా జనజీవనాన్ని స్థంభింపచేశాయి. గత ఏడాది నుంచి చూస్తే అంతా అతి వృష్టి అనుకోవాల్సిందే. అందుకే భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. సరైన ఎండల తీవ్రతతో పాటు ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతాయన్న హెచ్చరికలు గత కొన్ని నెలలుగా నిజమవుతున్నాయి.
చలి తగ్గినట్లు కనిపించినా...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలితీవ్రత ఎన్నడూ లేని విధంగా ఉంది. కొద్దిగా చలి తగ్గినట్లు కనిపించినా బయటకు వెళితే మాత్రం చలి దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలకంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.అలాగే ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ చలి తీవ్రత ఈసారి ఎక్కువగా కనిపిస్తుంది. మరొకవైపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మినుములూరు, అరకు, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. అలాగే పొగమంచు కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతుంది.
ఈ నెల చివరి నాటికి...
తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ నెల చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా చలితీవ్రత ఈ నెలాఖరుకు తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు పలు చోట్ల పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఇక జాతీయ రహదారులపై కూడా వాహనాలు నెమ్మదిగా సాగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.