నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది

Update: 2024-03-09 13:42 GMT

హైదరాబాద్‌లో నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీనగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎస్ఆర్డీపీ లో భాగంగా రూ.148.5 కోట్లతో సెకండ్ లెవల్ వంతెనను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్, సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్ పోస్టు అండర్ పాస్ నుంచి హయత్ నగర్ వెళ్లే వాహనాలకు ఉపయోగపడుతోంది.

ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైలును విస్తరిస్తామని హామీ ఇచ్చారు . రాజేంద్రనగర్‌లో హైకోర్టు నిర్మించి అక్కడి వరకు మెట్రో నిర్మిస్తామని.. హైదరాబాద్ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్ఎండిఎ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్ లో నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మూసీ నదిని రూ.50 వేల కోట్లతో ఆధునీకరిస్తామని.. వైబ్రంట్ తెలంగాణ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని సిఎం రేవంత్ చెప్పారు. ఎల్బీ నగర్‌కు వస్తే తన గుండె వేగం పెరుగుతుందని, తన స్నేహితులు, బంధువులు, జిల్లా ప్రజలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నారని, 2019 ఎంపీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు తనకు 30వేల మెజార్టీ ఇచ్చారన్నారు.


Tags:    

Similar News