Harish Rao : కాస్త గ్యాప్ ఇవ్వవయ్యా.. అప్పుడే ఏం కొంప మునిగిందని?

ఓడిపోయామన్న ఫ్రస్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా బయటపడటం లేదు

Update: 2025-12-10 12:30 GMT

ఓడిపోయామన్న ఫ్రస్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా బయటపడటం లేదు. ప్రతి విషయంలోనూ విమర్శలు చేయడం పనిగా పెట్టుకుని ప్రజల నుంచి వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నట్లుంది. తెలంగాణలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒకరకంగా విజయవంతమైందనే చెప్పాలి. పెట్టుబడులు సంగతి పక్కన పెడితే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా ఈ సమ్మిట్ చేయగలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గ్లోబల్ సమ్మిట్ అలా ముగిసిందో లేదో వెంటనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు అందుకున్నారు. కొంత గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత పెట్టుబడులపై స్పందించి ఉంటే బాగుండేది. కానీ సమ్మిట్ ముగిసిన కొద్ది గంటల్లోనే వ్యతిరేకంగా మాట్లాడటంపై సొంత పార్టీ నేతలు కూడా తప్పు పడుతున్నారు.

పెట్టుబడుల కోసం కాదని...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి విమర్శలు వస్తాయనే ముందుగానే ఇది పెట్టుబడుల కోసం సదస్సు కాదని చెప్పింది. కేవలం 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడానికేనని స్పష్టంగా చెప్పింది. ఎవరైనా సమ్మిట్ కు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ఎంవోయూలు చేసుకుంటామని చెప్పింది. ఎలాంటి హడావిడి లేకుండా ముందు నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానించింది. రెండు రోజులు పాటు జరిగిన ఈ సమ్మిట్ లో దాదాపు ఐదున్నర లక్షలకోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం పెట్టుబడులపై అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు.
గంటల్లోనే విమర్శలు చేయడంతో...
కానీ బీఆర్ఎస్ మాత్రం గ్లోబల్ సమ్మిట్ గోల్ మాల్ అంటూ వక్రీకరించే ప్రయత్నం చేసింది. అందులోనూ మాజీ మంత్రి హరీశ్ రావు ఒక అడుగు ముందుకేసి సమ్మిట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో దావోస్ కు వెళ్లి వచ్చి పెట్టుబడులు వచ్చాయని చెప్పినా ఒక్క పెట్టుబడి కూడా రాలేదని, కోట్ల రూపాయలు సమ్మిట్ పేరిట తగలేశారంటూ మండిపడ్డారు. నిజానికి పెట్టుబడులు వచ్చాయా? లేదా? అన్నది ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత విమర్శలు చేస్తే బాగుండేది. కానీ ముందే బీఆర్ఎస్ ముఖ్యులుర సమ్మిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై వారికే ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. కాస్త గ్యాప్ ఇవ్వండయ్యా బాబూ అని సొంత పార్టీ నేతలే అంటున్నారంటే హరీశ్ రావుకు ఎంత అత్యుత్సాహ పడుతున్నాడో చెప్పకనే తెలుస్తుంది. సమ్మిట్ లో ఏదైనా లోపాలుంటే కొంత వ్యవధి ఇచ్చి విమర్శలు చేసి ఉంటే బాగుండేది. కానీ సమ్మిట్ ముగిసిన గంటకే గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ప్లాప్ అయినట్లు ప్రచారం చేయడాన్ని బీఆర్ఎస్ అనుకూలురు కూడా వ్యతిరేకిస్తున్నారు.
Tags:    

Similar News