Kalvakuntla Kavitha : కవిత ఫైర్ అయ్యారు.. ఈసారి మాత్రం బీఆర్ఎస్ నేతల మీద కాదు
తెలంగాణ జాగృతి సంస్థ 2006లో ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు
తెలంగాణ జాగృతి సంస్థ 2006లో ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ఆశీస్సులతో జాగృతిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. బంజారాహిల్స్ లోని తన ఇంటికి సమీపంలోనే తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త ఆఫీసులో కల్వకుంట్ల కవిత పూజలు చేశారు. గతంలో ఇందిరాపార్కు వద్ద ఆఫీసు ఉండేది. దానిని మూసి వేసిన కవిత కొత్తగా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తన ఇంటివద్దనే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రాష్ట్రం సాధించిన తర్వాత అద్భుతమైన పాలన అందించామని తెలిపారు.
అవతరణ దినోత్సవం సందర్భంగా...
జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని అనాలని కవిత డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి ముఖ్యమంత్రి పదవి దక్కిందని అన్నారు. ఇది మన తెలంగాణ ప్రజల గ్రహచారమని అన్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారని అన్నారు. తెలంగాణలో జూన్ 2న రాజీవ్ గాంధీ యువ పథకం పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారని, తెలంగాణకు రాజీవ్ గాంధీ కి ఏం సంబంధమని కవిత ప్రశ్నించారు. తెలంగాణవాదుల పేర్లు పెట్టాలని ఆమె కోరారు. తెలంగాణ నీటిని తరలించుకుపోతున్నా రేవంత్ రెడ్టి పట్టించుకోవడం లేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నిర్మిస్తున్నప్పటికీ ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని కల్వకుంట్ల కవిత నిలదీశారు.
జూన్ 2న మహాధర్నా...
గోదావరి, కావేరీ అనుసంధానం పేరు మీద తెలంగాణ నీటిని చంద్రబాబు తరలించుకుపోతున్నారని, అపెక్స్ కమిటీ ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని జూన్ 2నడిమాండ్ చేయాలని కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే నోటీసులు కేసీఆర్ కు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అది కాంగ్రెస్ కమిషనా? కేసీఆర్ కమిషనా? అని ప్రశ్నించారు. తెలంగాణ జాతిపిత మీద ఇంతటి కక్షసాధింపా? అని ఆమె మండిపడ్డారు. కొత్త ఆఫీసులో తన కుటుంబ సభ్యులతో కలసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున జాగృతి కి చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణ జాగృతి తరుపున ఆమె జూన్ నాలుగో తేదీన ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్, మరొక కన్ను జాగృతి అని, ఆయన మీద ఈగవాలితే ఊరుకోమని కవిత వార్నింగ్ ఇచ్చారు.