Malla Reddy : మాస్ మల్లన్న రూటు మార్చారా? మరేదైనా ప్లాన్ ఉందా?

రాజకీయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొనడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పెద్ద స్కెచ్ వేసినట్లు తెలిసింది

Update: 2025-07-22 12:21 GMT

తెలంగాణ పాలిటిక్స్ లో మల్లారెడ్డి ప్రత్యేక స్టయిల్. విద్యాసంస్థల అధిపతిగా ఆయన కోట్లు సంపాదించినా లభించని తృప్తి రాజకీయాల్లో కేవలం పదేళ్లలోనే రుచి చూశారు. పాల వ్యాపారం నుంచి ప్రారంభమైన మల్లారెడ్డి జీవితం కోటీశ్వరుడిగా మారడానికి విద్యాసంస్థలే కారణం. ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ మల్లారెడ్డి రాజకీయాల్లోనూ అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించిన మల్లారెడ్డి తర్వాత రూటు మార్చి బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత 2018 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిచిన కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి కూడా అయి ఆయన కలను నెరవేర్చుకున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక...
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. విద్యాసంస్థలు ఆక్రమిత స్థలంలో నిర్మించారని కొన్ని కూల్చివేతలు జరిగాయి. దీంతో బీఆర్ఎస్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆదాయపు పన్ను శాఖ దాడులు కూడా జరిగాయి. దీంతో మల్లారెడ్డి తొలినాళ్లలో మాస్ మల్లన్నగా ఉన్నా.. తర్వాత కొంత నెమ్మదించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మంచిగా ఉంటూ తన వ్యాపారాలను, విద్యాసంస్థలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సవాళ్లు చేసిన మల్లన్న తర్వాత చల్లబడి ఇప్పుడు తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటూ మదనపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రాజకీయ ఇబ్బందులతోనేనా?
అలాంటి మల్లన్న రాజకీయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొనడానికి పెద్ద స్కెచ్ వేసినట్లు తెలిసింది. తాను బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. తన అల్లుడు మర్రి రాజశేఖర్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే తన కోడలిని బీజేపీలోకి పంపేందుకు సిద్ధమయినట్లు కనపడుతుంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ వెనక మతలబు ఏంటన్న చర్చ జరుగుతుంది. బీజేపీలో ఉంటే కొంత సేఫ్ అని భావించి ప్రీతిరెడ్డిని బీజేపీలో చేర్పించే ప్రయత్నించేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినపడుతుంది.
ఈటలతో వివాదంతో...
ఆదాయపు పన్ను దాడుల నుంచి కాకుండా తన విద్యా సంస్థలను కాపాడుకోవడానికే కోడలిని బీజేపీలోకి పంపే ప్రయత్నాన్ని మల్లన్న చేస్తున్నారన్న టాక్ వినపడుతుంది. కొన్ని ఫ్లెక్సీలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. మరొక వాదన కూడా వినపడుతుంది. బండి సంజయ్ కు, ఈటల రాజేందర్ కు పొసగకపోతుండటంతో మల్కాజ్ గిరి పార్లమెంటు నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడానికి మల్లారెడ్డి ఇలా ప్లాన్ చేశారా? అన్న చర్చ కూడా జరుగుతుంది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. సొంత పార్టీలో ఉన్న తమ ప్రత్యర్థికి చెక్ పెట్టడానికి అన్ని రకాల వ్యూహాలు పన్నుతారు. బండి సంజయ్ కూడా అదే దారిలో స్నేహారెడ్డితో భేటీ అయ్యారని కూడా అంటున్నారు. అయితే బండి సంజయ్ తో భేటీ మార్యాదపూర్వకమేనని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News