BRS : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఈర్ఎస్ ఫోకస్
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఈర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఈర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు. గద్వాల్ కు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గద్వాలలో బీఆర్ఎస్ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించింది. 2023 ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ మద్దతుదారులుగా మారిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ఆ యా నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి మారినప్పటికీ క్యాడర్ లో ధైర్యాన్ని నూరిపోసేందుకు కేటీఆర్ ఆ నియోజకవర్గాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. కేవలం పర్యటించడమే కాదు అక్కడ నియోజకవర్గాల ఇన్ ఛార్జులను నియమించకపోయినప్పటికీ నేతలకు పరోక్షంగా సంకేతాలను ఇస్తున్నట్లు తెలుస్తుంది.
గద్వాల్ లోకేటీఆర్ కు ఘన స్వాగతం...
ముందుగా గద్వాల్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గద్వాల్ లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆయన కాంగ్రెస్ మద్దతుదారుగా నిలిచారు. అయితే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్పీకర్ నోటీసులకు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారు. అందుకే ఇప్పుడు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల చేతనే వారు ఏ పార్టీలో ఉన్నదీ చెప్పించాలన్న ఉద్దేశ్యంలో కేటీఆర్ పర్యటనలు సాగనున్నాయి.
క్యాడర్ ను కాపాడుకునేందుకు...
గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిన వెంటనే ఇన్ ఛార్జి బాధ్యతలను హనుమంతునాయుడుకు అప్పగించింది. అక్కడ పార్టీ క్యాడర్ ను కాపాడాలని, వారికి అండగా నిలవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడులకు అప్పగించింది. పార్టీ క్యాడర్ ను, ద్వితీయ శ్రేణి నేతలను కాపాడుకునే లక్ష్యంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలు సాగిస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంతో వస్తున్నారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారిన నేతలు తిరిగి వచ్చినా బీఆర్ఎస్ నాయకులకు సంకేతాలు ఇచ్చే దిశగా కేటీఆర్ పర్యటనలు సాగుతున్నాయి. మొత్తం మీద గద్వాల్ లో గులాబీ పార్టీలో జోష్ పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.