Etala Rajender : ఈటల అలా మాట్లాడి తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నట్లయిందా?

ఈటల రాజేందర్ అంటే రాజకీయ అనుభవమున్న నేత. కానీ తన మాటలతో గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు

Update: 2025-05-12 12:35 GMT

ఈటల రాజేందర్ అంటే రాజకీయ అనుభవమున్న నేత. మావోయిస్టు ఉద్యమాల నుంచి వచ్చిన ఈటల రాజేందర్ తర్వాత దానికి బై బై చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెంత చేరారు. ఈటల రాజేందర్ ఆచి తూచి మాట్లాడతారు. ఎప్పుడూ ఎవరినీ తూలనాడరు. బీఆర్ఎస్ లో నాడు ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్న సమయంలోనూ ఈటల రాజేందర్ చాలా అణుకువగా వ్యవహరించారు. మాస్ లీడర్ గా కాకుండా ఈటల రాజేందర్ తెలివైన రాజకీయనేత అని అందరూ అనుకున్నారు. కేసీఆర్ కు వెన్నంటే దాదాపు పదేళ్లకు పైగానే కొనసాగారు. అయితే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయినప్పటికీ ఈటల రాజేందర్ లో చాలా అసహనం కనిపిస్తూ వచ్చింది.

బీఆర్ఎస్ లో నాడు ఉండి...
ఆరోజు పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకున్నారు. కేసీఆర్ ను ఎదరించారు. గులాబీ జెండాను మోసింది తామేనని అనడంతో కేసీఆర్ కు కాలింది. దీంతో ఈటల రాజేందర్ ను మంత్రిపదవి నుంచి తప్పించారు. ఈటల భూముల కుంభకోణాలపై దర్యాప్తునకు ఆదేశించారు. వేలాది ఎకరాల పేదల భూములను అక్రమంగా ఆక్రమించారంటూ గత ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. అయితే ఈటల మీద కోపంతో తప్పుడు కేసులు పెడుతున్నారని అనుకున్నారంతా. అదే ఆయనకు కలసి వచ్చింది. హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఎంత ఖర్చు చేసినా ఈటల రాజేందర్ విజయాన్ని ఆపలేకపోయారు. ఈటల కిందిస్థాయి నుంచి వచ్చిన నేత కావడంతో ఆయన మాటలు కూడా సూటిగా ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మారుతుందని ఎవరూ ఊహించలేదు.
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు...
అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఈటల రాజేందర్ ఇమేజ్ ను డ్యామేజీ చేసేలా కనిపిస్తున్నాయి. హైడ్రా పై విమర్శలు చేయవచ్చు. పేదలకు అండగా నిలవచ్చు. పేదల ఇళ్లను కూల్చివేస్తుంటే అడ్డుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని పరుష పదజాలంతో రాయలేని భాషతో మాట్లాడటమంటే ఈటల రాజేందర్ పై ఇన్నాళ్లు ఉన్న గౌరవం పోయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. హైడ్రా కేవలం ఆక్రమణలను మాత్రమే కూలుస్తుందన్న విషయం అందరికీ తెలుసు. ప్రజల పక్షాన పోరాడాలంటే దానికి వేరే మార్గాలున్నాయి. అంతే తప్ప ముఖ్యమంత్రిని కించపర్చే విధంగా మాట్లాడి ఈటల రాజేందర్ తన హుందాతనాన్ని తానే తగ్గించుకున్నారంటున్నారు.
హైడ్రా కూల్చివేతలపై...
హైడ్రా కూల్చివేతలపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తమకు ఓట్లు వేసిన ప్రజలకు అండగా నిలబడేందుకు వారు హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కొందరు హైడ్రా తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేదల ఇళ్లకు కూల్చడానికి తీసుకురాలేదని, హైదరాబాద్ నగరం భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నాలాలు, చెరువులు ఆక్రమించిన వాటినే కూల్చివేస్తున్నారని పదే పదే చెబుతున్నారు. అంటే నగరం ఎలా పోయినా పరవాలేదు. తన ఓటు బ్యాంకు చెక్కు చెదరకూడదని, ముఖ్యమంత్రినే దూషిస్తే హీరోగా మారతానని ఈటల రాజేందర్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ ఆ వ్యాఖ్యలు ఈటల రాజేందర్ పెద్దరికాన్ని మాత్రం తగ్గించాయనే చెప్పాలి. ఇప్పటికైనా మాట్లాడే సమయంలో కొంత సంయమనం పాటిస్తే మేలని ఈటలకు సూచిస్తున్నారు
Tags:    

Similar News