Raja Singh : రాజాసింగ్ ఏం ఆశిస్తున్నారు? ఆయనకు పార్టీలో జరుగుతున్న అవమానాలేంటి?
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
ఏంటో తెలియదు కానీ.. బీజేపీలోనూ అసంతృప్తులు మొదలయినట్లే కనిపిస్తుంది. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ మూడు సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023 లో ఆయన వరసగా గెలిచారు. ఆర్ఎస్ఎస్ భావాలతో పాటు సాలిడ్ కమలం పార్టీ నేతగా అందరిలోనూ గుర్తింపు పొందారు. అలాంటి రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ప్రధాన నేతలు వచ్చినా ఆయన వెళ్లడం లేదు. బీజేపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన ఆయనలో బలంగా ఉందనిపిస్తుంది.
వ్యతిరేక వ్యాఖ్యలతో...
రాజాసింగ్ పై అనేక కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. బీజేపీ ఒకసారి రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసి మళ్లీ ఎత్తివేసింది. అయితే ఆయనకు రాష్ట్ర పార్టీ నేతలతో పొసగడం లేదన్నది అర్థమయింది. పార్టీ నాయకత్వ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడి నేతలు పనిచేయడం లేదని భావిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తొలి నుంచి పార్టీ జెండా పట్టుకున్న తన లాంటి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అభిప్రాయంలో రాజాసింగ్ ఉన్నారు. అందుకే ఆయన తరచూ పార్టీ నేతలపైనే కామెంట్స్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయని తెలిసి కూడా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయన డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది.
బండి సంజయ్ పైనేనా?
గతంలోనూ రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నేతలపై వ్యతిరేక కామెంట్స్ చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు బీఆర్ఎస్ తోకుమ్మక్కవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేవే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాకపోవడానికి కారణం కుమ్మక్కు రాజకీయాలేనని రాజాసింగ్ వ్యాఖ్యలతో అర్థమవుతుంది. ఇక తాజాగా తనపై యుద్ధం మొదలయిందని, దొంగలంతా ఒక్కటయ్యారన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న కవిత కామెంట్స్ ను తాను సమర్ధించినందుకు తనపై దుష్ప్రచారం తన పార్టీ నేతలే మొదలు పెట్టారన్నారు. అదే సమయంలో బండి సంజయ్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. కరీనంగర్ నుంచే తనపై వార్ మొదలయిందని ఆయన అన్న మాటలపై ఇప్పుడ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది చూడాల్సి ఉంది.