Telangana : తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ "స్పెషల్" ఆఫర్
దసరా పండగ సమీపిస్తుండటంతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
దసరా పండగ సమీపిస్తుండటంతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమయింది. తెలంగాణలో దసరా అతి పెద్ద పండగ కావడంతో అందరూ సొంత ఊళ్లకు పయనమవుతారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తెలంగాణ వ్యాప్తంగా 7,754 బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 27వ తేదీ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు తిరగనున్నట్లు టీజీ ఆర్టీసీ ప్రకటించింది.
ఈ నెల 27వ తేదీ నుంచి...
ఈ నెల 30వ తేదీన సద్దుల బతుకమ్మ, అక్టోబరు 2వ తేదీన దసరా పండగ ఉండటంతో ప్రత్యేక బస్సులు వచ్చే నెల ఆరో తేదీ వరకూ నడుస్తాయని టీజీ ఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఈ స్పెషల్ సర్వీసులు నడుస్తాయని,ఆర్టీసీ లో ప్రయాణం సురక్షితమని, అందులోనే ప్రయాణించి సౌకర్యంగా, సుఖంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.