Summer Effect : ఉడికి పోతుందిరా అయ్యా... రెండు నెలలు బతికి బట్టకట్టేదెలా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి

Update: 2025-04-26 04:21 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే సూర్యుడు జనాలకు చుక్కలు చూపుతున్నాడు. ఇక మే నెల, జూన్ గడిచేదెలా? అన్న భయం అందరినీ పట్టుకుంది. ఎండలతో పాటు వడగాలుల తీవ్రత కూడా అధికంగా ఉండటంతో పాటు ఉక్కపోతకు జనం అల్లాడిపోతున్నారు. ఇేప్పటికే అనేక మంది వడదెబ్బ తగిలి ఆసుపత్రులకు చేరుతున్నారు. ప్రభుత్వ ప్రయివేటు ఆసుపత్రులన్నీ జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి వాటితో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. ఇప్పటికే ఏపీలో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో టచ్ కావడంతో రాను రాను ఎండలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలతో భయపడిపోతున్నారు.

ఈ ప్రాంతంలో నేడు వడగాల్పులు...
ఈరోజు శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురంమన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్రవడగాలులు, 28 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం 4 మండలాల్లో తీవ్ర, 17మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో15, పార్వతీపురంమన్యం జిల్లాలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు , తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు.
రెడ్ అలెర్ట్...
తెలంగాణ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. హైదరాబాద్ నగరం ఉదయం పది గంటల నుంచి నిర్మానుష్యంగా మారుతుంది. ఉదయం పది గంటల నుంచి మొదలయిన భానుడి ప్రతాపం సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగుతుంది. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోవడంతో హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఈరోజు, రేపు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే గరిష్టంగా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని కూడా తెలిపింది.


Tags:    

Similar News