Revanth Reddy : ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే
దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ప్రారంభిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యాపరంగా అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి అన్ని ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు.
ఆయువుపట్టు అయిన శాఖలన్నీ...
తెలంగాణ పాలనకు ఆయువు పట్టు అయిన అన్నిశాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో ఈ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. మంచి ప్రభుత్వం అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాల్లో మంచి సర్పంచ్ లు ఉంటే అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సింగరేణి వంటి సంస్థలను మరింత సుస్థిరం చేసుకోవడమే కాకుండా అభివృద్ధి చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.