Cold Waves : ఉదయం.. సాయంత్రం బయటకు రాకపోవడమే మంచిదట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మరో వారం రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చలిగాలుల నుంచి తమను తాము రక్షించుకోవాలని కోరుతున్నారు. చలిగాలులు చెవుల్లోకి దూరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు. అలాగే శరీరంలో నీటి శాతం కూడా తగ్గుతుందని, చలి ఎక్కువ ఉందని నీరు తాగకుండా ఉండొద్దన్న సూచనలు కూడా వైద్యులు చేస్తున్నారు.
అనారోగ్యంతో ఆసుపత్రి చుట్టూ...
ప్రధానంగా వాతావరణం ఒక్కసారిగా మారడంతో జ్వరాలు, ఒళ్లునొప్పులు, దగ్గు వంటి వాటితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో ఇలాగే చాలా మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. మరొకవైపు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోయిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో సింగిల్ డిజిట్ కు పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో చలిపులి...
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరిగింది. ప్రజలు అలెర్ట్ గా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతన్నాయి. హైదరాబాద్ నగరంలోకూడా సాయంత్రం నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. ఉదయం వేళ పొగమంచు కూడా ఉంది. ప్రజలు ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, ఆస్మా రోగులు, వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.