IPl 2026 : ఫామ్ లోకి వచ్చిన చెన్నై.. ఢిల్లీకి మరొక ఓటమి
శనివారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ ను ఓడించింది
ఐపీఎల్ లో చెన్నై పుంజుకుంది. ఆటగాళ్లు ఫామ్ లోకి వచ్చినట్లుంది. శనివారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ ను ఓడించింది. 23 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. ప్రధానంగా సంజూ శాంసన్ తిరిగి ఫామ్ లోకి రావడంతో పాటు సెంచరీ కొట్టాడు. చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి భారీ పరుగులు చేసింది. 212 పరుగులు చేసిన లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ కాపిటల్స్ మరో ఓటమిని మూట గట్టుకుంది. చెన్నైకు ఈ సీజన్ లో ఇది తొలి గెలుపు కాగా, ఢిల్లీ కాపిటల్స్ కు రెండో వరస ఓటమి.
శాంసన్ ఫామ్ లోకి రావడంతో...
చెపాక్ మైదానం మళ్లీ సందడిగా మారింది. సొంత మైదానంలో విజయం కోసం ఎదురుచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆ నిరీక్షణకు తెరదించింది. సంజూశాంసన్ మెరుపు శతకం తో (56 బంతుల్లో అజేయంగా 115) బాదగా, వేగగామి జేమీ ఓవర్టన్ అద్భుతంగా బంతులు విసిరి (4/18) చెన్నైకి ఊపిరి పోశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై రెండు వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీని 189 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంతో ఐపీఎల్-19 సీజన్‌లో చెన్నైకి తొలి గెలుపు దక్కింది.
లక్ష్య ఛేదనలో...
ఢిల్లీ లక్ష్య ఛేదన వేగంగా ప్రారంభమైంది. కేవలం 3.5 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే ఆ ఊపు ఎక్కువ సేపు నిలవలేదు. కే.ఎల్.రాహుల్, పథుమ్ నిస్సాంక త్వరగానే ఔటవడంతో పవర్‌ప్లేలోనే ఢిల్లీ 61/2గా నిలిచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద సర్ఫరాజ్ ఖాన్ అద్భుత క్యాచ్ పట్టి కెప్టెన్ అక్షర్ పటేల్‌ను ఔట చేశాడు. 66 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీపై ఓవర్టన్ ఆధ్వర్యంలోని చెన్నై బౌలర్లు పట్టు సాధించారు. అయినప్పటికీ ట్రిస్టన్ స్టబ్స్ 38 బంతుల్లో 60 పరుగులు చేసి పోరాడాడు.
సమిష్టి విజయంతో చెన్నై...
మూడు వరుస పరాజయాల తర్వాత జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి ఒత్తిడి మధ్య చెన్నై సమగ్ర ప్రదర్శనతో జవాబు చెప్పింది. ఆ మార్పుకు కేంద్రమైన శాంసన్ ఒత్తిడిలో అద్భుత శతకం సాధించాడు. ఇది ఐపీఎల్‌లో అతని నాల్గో శతకం. 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అలరించాడు. ముఖ్యంగా కవర్ డ్రైవ్‌లు కచ్చితత్వంతో మెరిశాయి. 26 బంతుల్లోనే అర శతకం పూర్తి చేసిన శాంసన్, 52 బంతుల్లో శతకం అందుకున్నాడు.శాంసన్‌కు ఆయుష్ మాథ్రే మంచి సహకారం అందించాడు. అతడు 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ తొందరగా ఔటైన తర్వాత ఈ జంట రెండో వికెట్‌కు 67 బంతుల్లో 113 పరుగులు జోడించి ఇన్నింగ్స్ నిలబెట్టింది.