Vangaveeti : రాధా.. కనిపించవేమయ్యా... ఎన్నికలు వస్తున్నాయి.. అదైనా తెలుసా?

వంగవీటి రాధా ఎన్నికల సమయం సమీపిస్తన్నా ఎక్కడా కనిపించకపోవడం రాజకీయంగా చర్చ జరుగుతుంది

Update: 2024-01-25 12:45 GMT

వంగవీటి రాధా ఎన్నికల సమయం సమీపిస్తన్నా ఎక్కడా కనిపించకపోవడం రాజకీయంగా చర్చ జరుగుతుంది. అసలు వంగవీటి రాధాకు రాజకీయాలు చేయాలన్న ఆసక్తి ఉందా? లేదా? అన్న అనుమానం కూడా ఆయన అనుచరుల్లో బయలుదేరింది. అన్ని పార్టీలూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంటే వంగవీటి రాధా మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం, తన అవసరం ఉన్నోళ్లే పిలుస్తారులే అన్న రీతిలో ఉండటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే చట్టసభల్లోకి కాలుమోపి చాలా ఏళ్లు అయిందని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మళ్లీ పోటీ చేస్తావు? అంటూ వంగవీటి రాధాను ఆయన సన్నిహితులే ప్రశ్నిస్తున్నారు.

కూల్ గానే ఉంటూ...
నిజమే.. ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నా వంగవీటి రాధా మాత్రం కూల్ గానే ఉన్నాడు. పేరుకు ఆయన టీడీపీలో ఉన్పప్పటికీ ఆయన ఉన్నట్లుగానే లేరు. ఆయన పార్టీని పట్టించుకోవడం లేదా? లేకుంటే పార్టీ ఆయనను పట్టించుకోవడం లేదా? అన్నది కూడా చర్చే. ఎందుకంటే టీడీపీ నేతలు కూడా ఎవరూ వంగవీటి రాధాను కలిసేందుకు ప్రయత్నించకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. అలాగే వంగవీటి రాధా కూడా టీడీపీ నాయకత్వం వెంట పడి పరిగెత్తకపోవడం కూడా అదే రకమైన అనుమానం కలుగుతుంది. సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న డిమాండ్ ఉన్నా అక్కడ బొండా ఉమ పాతుకుపోయి ఉండటంతో అక్కడ టీడీపీ లో ప్లేస్ లేదని తెలుస్తోంది.
అనుచరుల్లో అసహనం...
మరి వంగవీటి రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కూడా అందరికీ అనుమానంగానే ఉంది. మరో వైపు పార్టీ మారతారన్న ఊహాగానాలు కూడా పెద్దయెత్తున జరుగుతున్నాయి. ఆయనను వైసీపీ ఆహ్వనిస్తుందని, మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని కోరుతుందని గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజానిజాలు మాత్రం బయటకు రాలేదు. మరోవైపు వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు వంగవీటి రాధాతో చర్చలు జరుపుతున్నారని మాత్రం చెబుతున్నారు. కానీ వంగవీటి రాధా మాత్రం బయటకు వచ్చి దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆయన అనుచరుల్లో కూడా అసహనం మొదలయింది.
ఈసారి కూడా...
టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో వంగవీటి రాధా పోటీ చేసి గెలవడానికి ఇదే మంచి సమయమని కూడా ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్ కాకుటే మరొకటి.. ఏదో ఒకటి తేల్చుకోకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. వంగవీటి రంగా కుమారుడిగా ఆయనకున్న ప్రత్యేక బలాన్ని కూడా చూపించలేక బలహీనంగా మారిపోతున్నారని, పార్టీ అగ్రనేతలు కూడా పట్టించుకోకుండా తన చేజేతులా వంగవీటి రాధా వ్యవహారం ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద బెజవాడ గడ్డ మీద వంగవీటి రాధా అసలు ఈసారి ఎన్నికల బరిలో ఉంటారా? లేదా గత ఎన్నికల మాదిరిగానే మౌనంగా ఉంటారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News