వైఎస్ హయాంలోనూ అంతే.. రేవంత్ రెడ్డి పోలిక, పాతవిషయాలు గుర్తుచేసిన పీసీసీ చీఫ్

కేసీఆర్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో 3 వేల ఓట్లే వచ్చాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ లీడర్‌గా ఉన్నారు.

Update: 2022-05-03 10:38 GMT

others

తెలంగాణ కాంగ్రెస్‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక రేపిన రచ్చ అంతాఇంతా కాదు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 వేల పైచిలుకు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిస్తే.. 2021 ఉప ఎన్నికలో కేవలం 3 వేల ఓట్లతో డిపాజిట్ కోల్పోయిందని సొంత పార్టీ నేతలే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లోపాయికారీగా కుమ్మక్కై బలహీనమైన అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చి బలిపశువును చేశారని అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర పరాజయానికి రేవంత్ రెడ్డే కారణమని సొంత పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం కూడాతత బలంగా ఎదురుదాడికి దిగింది.

అన్నీ తట్టుకుని నిలబడి ఇప్పుడిప్పుడే గేరుమార్చి స్పీడుగా దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక ఫలితాలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికపై మాట్లాడారు. ఉప ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో సరిపోల్చలేమని కుండబద్దల కొట్టారు. ఏదో ఒక నిర్దిష్టమైన అంశం ప్రాతిపదకన.. లేక వ్యక్తులు ప్రతిపాదికన ఉప ఎన్నికలు జరుగుతాయని.. వాటికి నిర్దిష్టమైన కారణం ఉంటుందన్నారు. వాటిని సాధారణ ఎన్నికలతో పోల్చలేమని చెప్పారు.

గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఎన్నికలను కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2001లో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం రెండో స్థానంలో నిలిచిందన్నారు. అప్పుడు వైఎస్ సీఎల్పీ లీడర్‌గా ఉన్నారని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షమన్నారు. అలాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 3,400 ఓట్లు వచ్చాయని రేవంత్ అన్నారు. బలవంతుడైన వైఎస్ హన్మంత రెడ్డి అనే అభ్యర్థిని నిలబెట్టి 3 వేల ఓట్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ ఉప ఎన్నికపై కూడా రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2011లో జరిగిన పరిణామాలతో కొండా సురేఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారని గుర్తు చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొండా సురేఖ స్వల్ప మెజార్జీతో ఓడిపోయారని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం 3,700 ఓట్లు వచ్చాయని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ నాలుగు వేల ఓట్లు కూడా రాలేదన్నారు.

ఉప ఎన్నికల ఫలితాలు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని రేవంత్ చెప్పారు. అలాగని తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. 2001 ఉప ఎన్నిక తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 250 సీట్లతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో బీజేపీకి కేవలం 2 వేల ఓట్లు వచ్చాయని.. నోటా కంటే తక్కువ వచ్చాయన్నారు. నాగార్జునసాగర్‌లో ఓటు బ్యాంక్ బలంగా ఉన్న సామాజిక వర్గానికి టిక్కెట్ కేటాయించినా 7 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని.. బీజేపీ ఎక్కడుందని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ గాలివాటం పార్టీ అని.. ట్రయాంగిల్ ఫైట్ అనే మాటే లేదని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే తీర్పుతో సిద్ధంగా ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News