అభివృద్ధి.. సహజ వనరులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దాడి

వినియోగం ఇక్కడ జరిగినా ఉత్పత్తి, మైనింగ్ ఇంకెక్కడో చేయాల్సి వస్తుంది. అక్కడి కాలుష్యం ఇక్కడి వినియోగం వల్లనే..

Update: 2023-07-29 04:15 GMT

పట్టణాల అభివృద్ధికి సిమెంట్, ఇసుక ఇంకా ఇతర అనేక ఖనిజాలు మైనింగ్ చేస్తున్నారు. వెలుగు జిలుగుల నగరాల కొరకు నిరంతరంగా విద్యుత్ అందించటానికి బొగ్గు మైనింగ్ చేస్తున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణానికి నగరాల చుట్టూ ఉన్న గుట్టలను తొలుస్తున్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు నల్లా తిప్పితే నీళ్ళు అందించటానికి ఆనకట్టల నుంచి కోట్ల లీటర్ల నీటిని తరలిస్తున్నారు. ఒక వినిమయ సంస్కృతికి కావలసిన అన్ని హంగులు ఇతర ప్రాంతాల సహజ వనరుల వినియోగం జరుగుతోంది. అయితే, ఇలాంటి నగరం నుంచి వెలువడే గాలి కాలుష్యం భూతాపం పెరగడానికి, స్థానికంగా ‘హీట్ ఐలాండ్’ పరిణామం ద్వారా వాతావరణ మార్పులకు కారణం అవుతోంది. వినియోగం ఇక్కడ జరిగినా ఉత్పత్తి, మైనింగ్ ఇంకెక్కడో చేయాల్సి వస్తుంది. అక్కడి కాలుష్యం ఇక్కడి వినియోగం వల్లనే అని గుర్తిస్తున్నారు. కోట్ల లీటర్ల నీటిని మళ్లిస్తే అందులో 80 శాతం మురికి నీటిగా మారుతోంది. ఈ మురికి నీటిని నగరం బయటకు వదిలి చుట్టూ పక్కల పర్యావరణానికి, వ్యవసాయానికి హాని చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి మంచి నీటిని తీసుకుని, మురికి నీటిని బయటకు వదిలే ప్రక్రియ ఒక ఇంటి వాళ్ళు చేస్తే దౌర్జన్యం అంటాం. ఒక నగరం చేస్తే అభివృద్ధి అంటాం. అదే ఆధునికతలో ఉండే ఒక విచిత్రం. ఈ నగరాలు రోజూ లక్షల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ చెత్తను నగరం/ పట్టణాల బయట, చుట్టూ పక్కల పల్లెలలో గుట్టలుగా పేరుస్తున్నారు. తద్వారా అక్కడ పర్యావరణానికి విఘాతం ఏర్పడుతున్నది. ప్రతి మహా నగరం వల్ల చుట్టు పక్కల ఉండే పల్లెలు అనేక రూపాలలో బలి అవుతున్నాయి.

నగరాల మీద పడే వర్షం నీటిని ఒడిసిపట్టుకునే వ్యవస్థ ఎక్కడ లేదు. అక్కడ పడే వర్షం ప్రతి చుక్క నేల మీద పడిన వెంటనే కలుషితం అవుతున్నది. ఈ కలుషితాల వరద నదులను, చెరువులను కలుషితం చేస్తోంది. వాటి మీద ఆధారపడిన వ్యవసాయదారులు, మత్స్యకారులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలను సైతం ఈ నగరం/ పట్టణం వ్యవస్థలు కలుషితం చేస్తున్నాయి. నగరం విస్తృతి పేరిట పట్టణాభివృద్ది చట్టాలను అడ్డుపెట్టుకుని పల్లెలను ఒక నోటిఫికేషన్ ద్వారా కలుపుకుంటున్నారు. పల్లె ప్రజల సమ్మతి అవసరం లేదు. పల్లెలకు రక్షణగా ఉండే చట్టాలు ఈ ‘సామ్రాజ్య’ విస్తరణను అడ్డుకోలేకపోతున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా పట్టణాల సామ్రాజ్య విస్తరణకు మద్దతు ఇస్తుంది. భారత రాజ్యాంగంలో 73, 74 సవరణ అధికరణాలు గ్రామాలు, పట్టణాలలో ప్రజాస్వామ్యబద్ధ స్థానిక పాలన కొరకు ఉన్నాయి. కానీ.. గ్రామాలు తమ ఉనికిని కాపాడుకునే చట్టాలు లేవు. గ్రామాలను పట్టణాలలో విలీనం చేసే హక్కు పట్టణాలకు కల్పించిన చట్టాలు, గ్రామాల సమ్మతి అవసరాన్ని విస్మరించాయి. ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు ఈ లోపాన్ని గుర్తించి, సవరించాలి.
పట్టణాల విస్తరణ, వనరుల భక్షణ సామ్రాజ్యవాద ధోరణికి భిన్నంగా లేదు. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు అనేక దేశాల వనరులను దోపిడీ చేయడం, అనేక ప్రాంతాలను విలీనం చేసుకోవడం చరిత్రలో చూశాం. బ్రిటన్ తుపాకులను వాడితే, పట్టణాలు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి. పట్టణాలలో విలీనం అయినా.. పల్లెల గోస, పల్లెవాసుల కష్టం ఎవరికీ పట్టటం లేదు. పట్టణాలలో విలీనం అయిన తరువాత సౌకర్యాలు మెరుగుపడిన పల్లెలు చాల తక్కువ. భూమిలేని నిరుపేదల పరిస్థితి ఇంకా ఘోరం. పల్లె భూస్వాములు భూమి ధరలు పెరిగిన నేపధ్యంలో తమ ఆస్తులను పెంచుకున్నారు. కానీ.. చిన్న కమతందారులు ధరలు పెరిగిన మొదటి దశలోనే అమ్ముకుని ఆస్తులు పోగొట్టుకుని బికారులు అయినారు. అనేక అమాయక గ్రామీణ కుటుంబాలు మోసగాళ్ళ బారినపడి మొత్తం పోగొట్టుకున్నారు. విలీనం అయిన పల్లెలలో భూమి లేని కుటుంబాల సంఖ్య పెరిగింది. వారి నైపుణ్యానికి తగిన పని దొరకక వలసలు పెరిగాయి. పెంకుటిల్లు పోయి కాంక్రీట్ భవనాలు, రోడ్లు వచ్చాయి. మంచి నీళ్ళు, మురుగు నీరు వ్యవస్థలు ఏర్పడలేదు. వాహనాలు పెరిగాయి, కాలుష్యం వచ్చింది. తెలిసిన ముఖాలు తగ్గి కొత్త మొఖాలు రోజూ చూసుకునే పరిస్థితి వచ్చింది. చుట్టరికాలు, బంధుత్వాలు, స్నేహాలు తగ్గి తమ ఊర్లోనే ‘అపరిచితులు’ అయ్యారు.
వేడి ద్వీపం ప్రభావంతో (heat island effect) పల్లెలలో పడాల్సిన వర్షం కూడా పట్టణాలలో మాత్రమే పడుతోంది. నగరాలలో పడిన వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే పరివాహక వ్యవస్థ కాంక్రీటీకరణకు బలి అయ్యింది. నగరంలో పడ్డ ప్రతి వర్షపు చుక్క క్షణాలలో కలుషితం అవుతుంది. వర్షం వస్తే నగరాలలో తిట్టుకుంటారు. నగరవాసులకు నీళ్ళు నల్లాలోనే రావాలి. పైపుల ద్వారా పోవాలి. ఇంకే విధంగా వచ్చినా ఇబ్బంది పడతారు. చిరాకు ప్రదర్శిస్తారు. నగరాల్లో సహజ భూ భాగాన్ని కాంక్రీట్ మాయం చేస్తుంది. రోడ్లు, దట్టమైన భవనాలు, వేడిని గ్రహించి నిలుపుకునే ఇతర కాంక్రీట్ నిర్మాణాల వల్ల "అర్బన్ హీట్ ఐలాండ్స్" సంభవిస్తాయి. ఈ ప్రభావం వల్ల విద్యుత్ ఖర్చులు (ఉదా. ఎయిర్ కండిషనింగ్ కోసం), వాయు కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరిగి అనారోగ్యం పెరుగుతుంది. మరణాలు సంభవిస్తాయి.
నగరాలు ఉత్పత్తి కేంద్రాలుగా కాక వినిమయ కేంద్రాలుగా మారడానికి ఆధునిక ఆర్థిక వ్యవస్థ దోహదపడుతోంది. అందుకే.. పర్యావరణ మార్పులు, వాతావరణ మార్పుల మీద ఆలోచిస్తున్నవారు, నగరాల అభివృద్ధిని సహజ వనరుల మీద, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద దాడిగా భావిస్తున్నారు. భూతాపం తగ్గాలంటే, పర్యావరణం తిరిగి సమతుల్య స్థితికి రావాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేళ్ళూనుకోవాలి. గ్రామాలు బాగున్నప్పుడే దేశం సుస్థిరం అవుతుంది.

(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)


Tags:    

Similar News