లండన్ లో ఘనంగా తెలుగు మాతృ భాషా దినోత్సవం

మన పిల్లలకు మన భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దటం మాత్రమే గాక

Update: 2022-09-01 08:24 GMT

భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, స్తంఘసంస్కర్త, వాడుక భాషా ఉద్యమనాయకుడు, తాత్వికుడు గిడుగు శ్రీరామమూర్తి జయంతిని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాళ్) నిర్వహించింది. దీనికి ముఖ్య అత్వధిగా భారత మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. తాళ్ ట్రస్టీ గిరిధర్ వెంకయ్యనాయుడుకి స్వాగతం పలికారు. తాళ్ సలహాదారులు డాక్టర్ రాములు దాసోజు వెంకయ్య నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు 50 సంవత్సరాల రాజకీయ జీవితం నమ్మిన ఆశయాలకు, విలువలకు అనుగుణంగా నడిచిందని చెప్పారు. ప్రఖ్యాత రాజకీయ వేత్తగా ప్రభావశీలమైన వక్తగా, విద్యార్థి కాలం నుండి రాజకీయాలలో తర్ఫీదు పొంది నాయకుడిగా ఎదిగారని చెప్పారు.

తాళ్ చైర్మన్ భారతి కందుకూరి తాము లండన్ లో గత 10 సంవత్సరాలుగా రెండు తెలుగు కల్చరల్ సెంటర్స్ నిర్వహిస్తున్నామని, అందులో తెలుగు భాష, సంగీతం, నృత్యాలు నేర్పుతున్నామని చెప్పారు. తాళ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రతి వేసవిలో రెండు నెలలు నిర్వహిస్తుందని, బాడ్మింటన్ నిర్వహిస్తుందని కూడా చెప్పారు. ఇవేకాకుండా ఉగాది, సంక్రాంతి పండుగలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. దాదాపు 100 మంది కార్యకర్తలు ఇందులో పనిచేస్తారని చెప్పారు. తాల్ సభ్యులు గిరి ధవళ మాట్లాడుతూ గిడుగు భాషా వేత్తగా ఎంత గొప్ప కృషి చేసారో, సంఘ సంస్కర్తగా కూడా ఎంతో పోరాడారని చెప్పారు. ఆయన తెలుగు భాషకు చేసిన సేవ చాలా గొప్పదని అన్నారు. పేరుప్రఖ్యాతిల కోసం ఆయన పని చేయలేదని, గొప్ప మానవీయ విలువలున్న మనిషని చెప్పారు.
భాషా సంస్కృతులే భవిష్యత్తులో మన చిరునామాను తెలియజేస్తాయని, అలాంటి భాషను, సంస్కృతిని కాపాడుకోవడమే తెలుగు భాషా దినోత్సవ సంకల్పం కావాలని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. శ్రీ గిడుగు రామ్మూర్తికి నివాళులు అర్పించిన శ్రీ వెంకయ్యనాయుడు, ప్రతి ఒక్కరికీ మాతృభాషను చేరువ చేయాలన్న గిడుగు స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని అమ్మభాషను కాపాడుకునేందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం స్వరాజ్యం సంపాదించుకున్న 75 ఏళ్ళలో విదేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో భారతీయులు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటీష్ గడ్డ మీద భారతీయులకు ఈ రోజు అందుతున్న గౌరవం చూస్తుంటే ఎంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉందని తెలిపారు. వసుదైవ కుటుంబ భావనను బలంగా నమ్మిన భారతీయులు సనాతన కాలం నుంచి కోరుకున్న నిజమైన పురోభివృద్ధి ఇదేనని పేర్కొన్నారు. మన భాషా సంస్కృతులను కాపాడుకుంటూ, ముందు తరాలకు చేరవేయాలన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ సంస్థకు అభినందనలు తెలియజేశారు. కాలానుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆదర్శనీయమని తెలిపారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, ఈ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మార్చారన్నారు. ఈ భావన మానవాళి పురోభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ వేడుక లక్ష్యం, వేడుకలు చేసుకోవడం మాత్రమే కాదని, స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల ప్రేరణను ముందుతరాల్లో నింపటమని స్పష్టం చేశారు. అతి బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న భారత్, గత 75 ఏళ్ళలో వ్యాక్సిన్ కోసం విదేశాల మీద ఆధారపడే స్థాయి నుంచి, దేశ విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం నిజమైన పురోగతి అని స్పష్టం చేశారు.
భాష అంటే మనం మాట్లాడే నాలుగు పలుకులే కాదని అన్నారు. మన పిల్లలకు మన భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దటం మాత్రమే గాక, మన పండుగల్లోని పరమార్థాన్ని తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు గ్రంథ పఠనాన్ని ప్రోత్సహించాలన్న ఆయన, తెలుగు కవులు నవ్యమార్గంలో యువతకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మన ప్రాచీన గ్రంథాల్లో మన సంస్కృతి మాత్రమే గాక, సాంఘిక జీవనం కూడా భాగమై ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ముందు తరాలకు అందజేయాలని స్పష్టం చేశారు. భాషను కాపాడుకోవడంతో పాటు నలుగురికీ సాయం చేయడం మరవద్దన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్ తరుణంలో ప్రవాస భారతీయులు చూపిన చొరవ దేశం మరువదని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కార్యనిర్వాహక వర్గంతో పాటు, బ్రిటన్ లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు కూడా పాల్గొన్నాయి.


Tags:    

Similar News