Pv Narasimharao : తెలుగోడు పీవీకి భారతరత్న... భళరా భళి.. మన పీవీకి అతి గొప్ప నివాళి

పాములపర్తి వెంకట నరసింహరావు మాజీ ప్రధానిగా మాత్రమే తెలుసు. ఆయన జీవితంలో ప్రతి పేజీ నేటి తరానికి ఒక పాఠం

Update: 2024-02-09 08:06 GMT

పాములపర్తి వెంకట నరసింహరావు మాజీ ప్రధానిగా మాత్రమే తెలుసు. ఆయన జీవితంలో ప్రతి పేజీ నేటి తరానికి ఒక పాఠం. ఆయనలో ఎన్ని కోణాలు. ఎన్ని పార్శ్వాలు.. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు పదిహేడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఎంత కృషి చేస్తే ఇలాంటిది సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ఇలా ఎదగడం సాధ్యమా?అన్న అనుమానాలకు పీవీ పేరు చెబితే అది తొలగిపోతుంది. ఎక్కడో మారు మూల గ్రామంలో జన్మించి దేశాన్ని ఏలడం.. అదీ దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఒక నేత దేశరాజకీయాలను శాసించడం అంటే మాటలు కాదు. ఆషామాషీ కాదు. అలాంటి పీవీ నరసింహారావుకు నేడు భారతరత్న ప్రకటించడం నిజంగా ముదావహం.

కుగ్రామంలో జన్మించి...
పీవీ నరసింహారావు 1921 జూన్ 28వ తేదీన జన్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో ఆయన రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు. ఆ తరవ్ాత వంగర గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇంటికి దత్తతకు వెళ్లారు. అప్పడే ఆయన ఇంటి పేరు మారింది. ప్రాధమిక విద్య వరంగల్ జిల్లాలో ప్రారంభించిన పీవీ న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పీవీ నరసిహారావు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1951లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరణించే వరకూ అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన అనేక బాధ్యతలను నిర్వహించారు.
ఆర్థిక సంస్కరణలతో...
రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ఆయన అనూహ్యంగా ప్రధాని అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది పీవీ మాత్రమే. 1991 నుంచి 1996 వరకూ ఆయన భారత ప్రధానిగా పనిచేశారు. ఈ సమయంలోనే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్థిక సంస్కరణలను అమలులోకి తెచ్చారు. అప్పటి వరకూ కూలిపోయే దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు పీవీ తన మేథస్సుతో ఊతమిచ్చి దేశం ఆర్థికంగా పతనం కాకుండా ఆయన చేసిన కృషి ఎవరూ మరువలేరు. కుల ప్రాబల్యం లేని, ప్రాంతం కలసిరాని చోటు నుంచి వచ్చిన పీవీ తన మేధస్సుతోనే అందలం ఎక్కారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎవరి ఊహలకు కూడా అందని పదవిని ఆయన అందుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నది కూడా మన పీవీ మాత్రమే. మన్మోహన్ సింగ్ ను ఆర్థికమంత్రిని చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత కూడా ఆయనదే.
అంతర్జాతీయంగా కూడా...
ఇక కేవలం దేశ రాజకీయాలు మాత్రమే కాదు. అంతర్జాతీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా నాడు ప్రముఖుల ప్రశంసలు పొందాయి. కాశ్మీర్ తీవ్రవాదరులు ప్రముఖులను కిడ్నాప్ చేసినప్పుడు వారి డిమాండ్లకు ఏమాత్రం లొంగకుండా వారిని విడిపించింది కూడా మన పీవీనే. అలాంటి లౌక్యుడు. ఇజ్రాయిల్ దౌత్య సంబంధాలతో పాటు తీవ్రవాదానికి పాకిస్థాన్ ఇస్తున్న బయటపెట్టి ప్రపంచదేశాాల్లో చర్చకు పెట్టడంతో పాటు ఆగ్నేసియాదేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం కూడా అంతర్జాతీయంగా ఆయనకున్న దృష్టి కోణానికి ఒక నిదర్శనం. ఆయన హయాంలోనే భారత్ కు చైనా, ఇరాన్ దేశాలతో సత్సంబంధాలు మెరుగుపడ్డాయి. అలా పీీవీ దేశాన్ని అంతర్జాతీయ చిత్ర పటంలో కూడా నిలిపారంటే ఆయనకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోవాలి? అన్న కామెంట్స్ చేసిన రాజకీయ నేతలు కూడా ఉన్నారు.
సాహిత్యరంగంలోనూ...
అయితే అదే సమయంలో బాబ్రీ మసీదుకూల్చివేత ఘటన, జేఎంఎం ముడుపుల కేసు వంటి ఆరోపణలు వినిపించినప్పటికీ అరుదైన మహా నేత పీవీ అని కొనియాడని వారుండరు. ఆయనను సొంత పార్టీ నేతలే కాదు ఆయన ఆలోచనలకు, వ్యూహాలకు ప్రత్యర్థులు కూడా ప్రశంసించిన రోజులున్నాయి.పీవీ నరసింహారావు కేవలం రాజకీయ రంగంలోనే కాదు. సాహిత్యరంగంలోనూ పేరుంది. ఆయన ఆ వయసులో కంప్యూటర్ ను ఉపయోగించడంలోనూ, అందులో మెళుకువలను నేర్చుకోవడంలో ఆయనకున్న జిజ్ఞాసకు ఒక ఉదాహరణ. ఆయన సాహిత్యరంగంలో చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రచించిన ఇన్‌సైడర్ అనేక భాషల్లో అనువదించారు. పదిహేడు భాషల్లో ప్రవేశం ఉన్న పీవీకి కాంగ్రెస్ పార్టీ హయాంలో కాకపోయినా బీజేపీ పాలనలో ఆయకు అత్యున్నత పురస్కారం భారతరత్న లభించడం నిజంగా తెలుగు వారి అదృష్టమే. ఒక తెలుగు వారికి అరుదైన పురస్కారం దక్కడం నిజంగా సంతోషించ దగ్గ విషయమే. ఆయన 2004 డిసెంబరు 23న మరణించారు.


Tags:    

Similar News