Russia : "పవర్" కోసం ఏదైనా చేయగలవాడే పుతిన్

రష్యా ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. ఆయనకు 88 శాతం ఓట్లు లభించినట్లు

Update: 2024-03-18 04:31 GMT

రష్యా ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. ఆయనకు 88 శాతం ఓట్లు లభించినట్లు ఇప్పటి వరకూ అందుతున్న సమాచారాన్ని బట్టి అందుతుంది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పోలింగ్ నిన్న ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి పుతిన్ అధికారాన్ని అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వ్లాదిమిన్ పుతిన్ 1999 నుంచి ఆయన రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. అంతా ఆయనదే.. ఆయన చెప్పిందే శాసనం.. చేసిందే.. చట్టం. అలా రష్యా రాజ్యాంగాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు మార్చేసి మరీ పదవిలో పాతుకు పోయాడు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. మరో ఆరేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు.

ఏదో ఒకపదవిలో...
కానీ ఇక్కడ ప్రజాస్వామ్యానికి తావులేదు. 1999 నుంచి ఇటు ప్రధాని పదవిలోనో లేక అధ్యక్షుడిగానో ఏదో ఒక పదవిలో పుతిన్ ఉంటూనే ఉన్నారు.2000 నుంచి 2004 వరకూ, మళ్లీ 2004 నుంచి 2008 వరకూ రెండుసార్లు ప్రధానిగా పనిచేశారు. 2008 నుంచి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూనే ఉన్నారు. పుతిన్ తన ప్రత్యర్థులందరినీ ఎన్నికల్లో మట్టుబెట్టేశారన్న ఆరోపణలున్నాయి. ఆయనకు ఇప్పుడు ప్రత్యర్థులెవరూ లేరు. ఆయనపై పోటీ చేయాలని ప్రయత్నించినా అది నామమాత్రమే. ప్రతిపక్ష నాయకుడు కూడా సరైన లేకపోవడంతో పుతిన్ చెప్పిందే వేదం.. ఆయన అనుకున్నట్లే దేశం నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
1999 నాటికి...
1999లో బోరిస్ ఎల్సిన్ నుంచి వ్లాదిమిన్ పుతిన్ అధికారాన్ని అందుకునే సమయానికి రష్యా పరిస్థితి బాగా లేదు.. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం మిగిలిపోయిన రష్యా పేరుకు అగ్రరాజ్యంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా దాని ప్రభావం అంతత మాత్రమే. అయినా అంతర్జాతీయంగా అమెరికాను ఎదుర్కోవడంలో ఆయన విజయవంతమయ్యారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశంగా అనేక విషయాల్లో అమెరికాను నిలువరించడంలో కీలక పాత్ర పోషించారు. రష్యాలో పుతిన్ చేపట్టిన సంస్కరణలు, సరళీకృత విధానాలు, కార్మికుల కనీస వేతనాల పెంపు వంటి పుతిన్ నిర్ణయాలు ప్రజలపై ప్రభావితం చేశాయి.
ప్రత్యర్థులను దెబ్బతీసి...
పుతిన్ ప్రత్యర్థులను రాజకీయంగా అణిచివేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం, వారిపై అక్రమంగా కేసులను బనాయించడంతో పాటు వారిని అరెస్ట్ చేయడం కూడా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన దేనికీ భయపడలేదు. ఉక్రెయిన్ తో యుద్ధం ఏడాదికిపైగా సాగిస్తున్నప్పటికీ అక్కడక్కడా నిరసనలు తప్ప ఆయనపై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. పుతిన్ పై అనేక ప్రచారం జరిగింది. ఆయన దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నారన్న వార్తలు ప్రపంచాన్ని చుట్టి వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఎప్పటికప్పుడు ఆయన జనంలో కనపడుతూ వాటికి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. దేశంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా దేశ గౌరవ ప్రతిష్టలను కాపాడారని ప్రజలు విశ్వసించారు. అందువల్లే ఆయనను ప్రజలు మరసారి ఆదరించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.



Tags:    

Similar News