పవన్‌... ఓటమిని కోరుకుంటున్నారా..?

పవన్‌ కళ్యాణ్‌ చేసే రాజకీయ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతుంటాయి. ఆయన వారాహి యాత్ర ద్వారా కావల్సినంత..

Update: 2023-07-11 04:25 GMT

పవన్‌ కళ్యాణ్‌ చేసే రాజకీయ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతుంటాయి. ఆయన వారాహి యాత్ర ద్వారా కావల్సినంత పొలిటికల్‌ మైలేజీని సంపాదిస్తున్నారు. ఈ ప్రచారం ఆయనకు, జనసేనకు ఉపయోగపడుతుందా? ఎన్నికల్లో విజయానికి బాటలు వేస్తుందా?

పవన్‌ కళ్యాణ్‌ రెండో విడత యాత్రలో వాలంటీర్ల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళల అపహరణలో వాలంటీర్ల పాత్ర ఉందంటూ జనసేనాని వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. మహిళల మిస్సింగ్‌కు సంబంధించి తన దగ్గర ఎన్‌.సి.ఆర్‌.బి డేటా ఉందంటూ ఆయన వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని, దీనికి వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన మొదటి విడత యాత్రలో కూడా చెప్పారు.

ఏలూరులో జరిగిన సభలో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించడానికి, వాలంటీర్లపై ఆరోపణలు చేయడానికి ఓ ప్రధాన కారణం కనిపిస్తోంది. జగన్మోహన్‌రెడ్ది ఇటీవల కాలంలో పవన్‌పై విమర్శల డోస్‌ పెంచారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ, వివాహ వ్యవస్థతో పవన్‌ ఆడుకుంటున్నారని జగన్‌ ఆరోపిస్తున్నారు. ఈ విషయం పవన్‌ను బాగా చిరాకు పెడుతోంది. మూడు పెళ్ళిళ్ల గురించి మాట్లాడుతూ మహిళల్లో తనను చులకన చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. అందుకే మహిళల మిస్సింగ్‌ గురించి పదే పదే ప్రస్తావిస్తూ వైకాపా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.

జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్లపై కూడా పవన్‌ విరుచుకుపడుతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. గత నాలుగేళ్లుగా మహిళల మిస్సింగ్‌ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య ఆంధ్ర ప్రదేశ్‌ కంటే ఎక్కువ ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిటి గతంలో అమ్మాయి కనిపించకపోతే చాలామంది తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేవారు కాదు. ఇప్పుడు అలాకాదు. అమ్మాయి మిస్‌ అవగానే ముందు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. కేసుల పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం. వేల మంది అమ్మాయిలు మిస్‌ అయితే చంద్రబాబు, అతనికి మద్దతు ఇచ్చే మీడియా చూస్తూ ఊరుకోవు కదా! పవన్‌ మాటలు చాలా డ్యామేజింగ్‌ అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇక వాలంటీర్ల మీద పవన్‌ చేసే వ్యాఖ్యలు కూడా ఆయనకి బూమరాంగ్‌ అయ్యే ప్రమాదం ఉంది. గతంలో వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించినప్పుడు చంద్రబాబు కూడా వాళ్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నప్పుడు వచ్చి తలుపు కొడతారంటూ ఆరోపించారు. తర్వాత వాళ్ల ప్రాధాన్యత అర్థమై, వాళ్ల గురించి ప్రస్తావించడం మానేశారు. కానీ పవన్‌ వాలంటీర్లను టార్గెట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటి గడప దగ్గరకు తీసుకువెళ్లడంలో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చాలామందికి వాళ్లంటే మంచి అభిప్రాయమే ఉంది. మీడియా దృష్టిని ఆకర్షించాలని, తన అభిమానుల చేత చప్పట్లు కొట్టించుకోవాలని, సంచలనం సృష్టించాలని పవన్‌ చేసే వ్యాఖ్యల వల్ల వాలంటీర్ల కంటే పవన్‌కే ఎక్కువ నష్టమనే అభిప్రాయం ఉంది. ఓటు వేసే ముందు ఏ పార్టీ వల్ల మేలు జరుగుతుందో అనే ఓటరు ఆలోచిస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్‌ ఓటు మాత్రమే నాయకులను, పార్టీలను గెలిపిస్తుంది. ప్రభుత్వం మీద విమర్శల కంటే, గెలిస్తే తానేం చేస్తానో పవన్‌ చెప్పగలగాలి. తన మ్యానిఫెస్టోను ఇప్పట్నుంచే జనాల్లోకి తీసుకువెళ్లాలి.

జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలు అంటూ ఏడాది ముందు నుంచే తన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగారు. అఖండ మెజార్టీతో గెలుపొందారు. వైకాపా ప్రభుత్వంపై పవన్‌కి ఉన్న ద్వేషం జనాలకి ఉండకపోవచ్చు. వైకాపా మీద, ఆ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల మీద చేస్తున్న ఆరోపణలు జనసేనానికి ఎలాంటి మంచీ చేయవు. పాజిటివ్‌ ఓటును సాధించలేకపోతే పవన్‌ పార్టీకి మరోసారి ఘోర పరాభవం తప్పదు.

Tags:    

Similar News