KCR : ఇగో హర్టెడ్...అందుకే రాజీనామాకు సిద్ధమవుతున్నారట

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

Update: 2023-12-06 06:28 GMT

కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయనున్నారా? శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అవును.. ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఓటమి తర్వాత ఈ విషయాన్ని స్పష‌్టం చేయకపోయినా ఆయన మనసెరిగిన వారు మాత్రం శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారని మాత్రం చెబుతున్నారు. కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు చోట్ల పోటీకి దిగారు. కామారెడ్డి, గజ్వేల్ లో ఆయన బరిలోకి దిగడం అప్పట్లోనే ఆశ్చర్యం కలిగించింది. చివరకు ఆయన గజ్వేల్ లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. ప్రభుత్వం కూడా అధికారంలోకి రాలేదు. ఇటు ప్రభుత్వం అధికారంలోకి రాక, తాను కామారెడ్డి ఓటమిని కేసీఆర్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

గజ్వేల్ స్థానానికి...
దీంతో ఆయన గజ్వేల్ శాసనసభ స్థానానికి కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నారు. తాను శాసనసభ్యుడిగా కొనసాగే కంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగడం బెటర్ అని ఆయన భావిస్తున్నారు. శాసనసభ్యుడిగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశముండదు. ఆయన ఇగో అంగీకరించడం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు పదేళ్ల పాటు ఉన్న శాసనసభలో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడాన్ని ఆయన సుతారమూ ఇష్టపడటం లేదు. అధికార పార్టీ తమకు మాట్లాడేందుకు కూడా పెద్దగా సమయం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగే అవకాశాలున్నాయన్నది ఆయన అంచనా.
కేటీఆర్‌‌కు అప్పగించి...
అందుకే శాసనసభ పక్ష నేతను ఎవరినో ఒకరిని ఎంపిక చేసి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. వీలుంటే.. అప్పటి అవసరాలు.. ఆకాంక్షలను బట్టి పార్లమెంటుకు పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కొన్నాళ్ల పాటు రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీకి వెళ్లాలన్న ఆలోచన కూడా ఆయన చేస్తున్నారు. ఎటూ పార్టీని కేటీఆర్ కు అప్పగించాలని భావిస్తుండటంతో రానున్న ఐదేళ్ల పాటు ప్రభుత్వంపై పోరాటాన్ని ఆయనకే వదిలేసి తాను ఢిల్లీకి వెళ్లి కొంత విశ్రాంతి తీసుకోవాలని యోచిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఢిల్లీలో ఉండి కావాల్సి వస్తే ఇక్కడ కేటీఆర్ కు దిశానిర్దేశం చేయవచ్చని, ఇక్కడ ఉండి అధికార పార్టీ నేతల మాటలతో అవమానాలు పడే కన్నా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి అక్కడకు వెళ్లడం మంచిదన్న డెసిషన్ కు ఆయన వచ్చినట్లు తెలిసింది.
చిన్నతనంగా...
శానససభ్యుడిగా ఉంటే ఏదో ఒక సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ ను వదిలి అసెంబ్లీలో మరొక చోట కూర్చోవడం కూడా ఆయన చిన్నతనంగా ఫీలవుతున్నారు. పూలమ్మిన చోట రాళ్లమ్మడం ఇష్టం లేకనే కేసీఆర్ గజ్వేల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నారు. అయితే దీనిపై కొందరి ముఖ్యనేతలతో ఇప్పటికే చర్చించినట్లు తెలిసింది. శాసనసభ పక్ష నేత ఎంపిక తర్వాత కేసీఆర్ గజ్వేల్ శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తారన్న టాక్ వైరల్ అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పార్టీ సీనియర్ నేతల వరకూ అదే బెటర్ అని భావిస్తుండటంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో గజ్వేల్ నియోకవర్గానికి ఉప ఎన్నిక తప్పేలా కనిపించడం లేదు.


Tags:    

Similar News