Chandrababu Vs Jagan : బాబులో ఆ భయం పుట్టించేందుకు జగన్ ఏం చేశారో తెలుసా?

ఒక్కటి మాత్రం నిజం చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఈ ఎన్నికల్లో భయపడుతున్నారు.

Update: 2024-02-19 13:10 GMT

ఒక్కటి మాత్రం నిజం చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఈ ఎన్నికల్లో భయపడుతున్నారు. ఈ ఎన్నికలు ఆయనకే కాదు.. పార్టీకి కూడా అంతే కీలకం. చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా రాజకీయంగా భయపడి ఉండరు. ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం, కంటతడి పెట్టడం కూడా ఇదే తొలిసారి. ఆయన పొలిటికల్ లైఫ్ లో జగన్ ను చూసి భయపడినట్లు ఏ నేతను చూసినా భయపడలేదనడంలో ఏ మాత్రం అతి శయోక్తి లేదు. చంద్రబాబు లౌక్యం ఎక్కువ ఉన్న మనిషి. అలాగే రాజకీయంగా అనేక వ్యూహాలు రచించిన నేతగా అందరిలోనూ పేరుంది.

విజన్ ఉన్న నేతగా....
పైగా విజన్ ఉన్న నేతగా ఆయన మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సంపాదంచుకున్నారు. ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనలోని పొలిటీషియన్ పూర్తిగా మాయమైపోతాడు. ముఖ్య అధికారి పాత్ర ఎంటరై పోతుంది. నిత్యం అధికారులతో సమీక్షలు, నిరంతరం వీడియో కాన్ఫరెన్స్‌లు, పర్యటనలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా కుటుంబానికి కేటాయించే సమయం కంటే ఎక్కువ సమయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికే కేటాయిస్తారన్న పేరుంది. అలాగే ఆయన ముప్ఫయి ఏళ్ల ముందు చూపుతో ఏ పనిని అయినా మొదలు పెడతారంటారు. అలాంటి పేరున్న చంద్రబాబు ఇప్పుడు జగన్ అంటేనే ఒకరకమైన ఫోబియా వచ్చినట్లు షేక్ అయిపోతున్నారు.
జైలుకెళ్లింది కూడా...
తొలిసారి చంద్రబాబు జైలుకెళ్లింది కూడా జగన్ హయాంలోనే. దాదాపు యాభై మూడు రోజుల పాటు జైలులో ఉన్నారంటే అది జగన్ హయాంలోనే జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంతటి చర్యలకు తనపై దిగలేదంటారు. తనను టచ్ చేస్తే సానుభూతి వస్తుందని, అందుకే తనను అరెస్ట్ చేయరన్న నమ్మకాన్ని జగన్ వమ్ము చేయగలిగారు. అందుకే వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవకూడదని ఏడు పదుల వయసులో చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా తనతో పాటు పార్టీ కూడా మునిగిపోవడం ఖాయమని ఆయనకు తెలుసు. అందుకే పెద్దగా ఓట్లులేని బీజేపీతో కూడా బంధం కొనసాగించడానికి సిద్ధపడ్డారు. బీజేపీ అండ తనకు ఉందని తెలిస్తే చాలు అధికార యంత్రాంగం ఏ మాత్రం ఎన్నికల సమయంలో తమ జోలికి రాదని భావించడం ఒక కారణం అయిఉండవచ్చు.
ఎన్ని సీట్లను అయినా...?
అందుకోసమే ఎన్ని సీట్లైనా త్యాగం చేసేందుకు సిద్ధపడుతున్నారు. తన వాళ్లు, పార్టీకి నమ్మకంగా పనిచేసిన వాళ్లు అనేది లేదు.. జగన్ పార్టీ అభ్యర్థిని ఓడించగల నేత ఎవరైనా సరే.. వారికి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు తీరు ఇలా లేదు. తనను ఏపీ ప్రజలు నమ్ముతారని, జగన్‌‌ను ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించరని భావించిన చంద్రబాబు అంచనాలు తలకిందులు కావడంతో ఆయన ఈసారి ఎవరినీ నమ్మడం లేదు. సీనియర్ నేతలను కూడా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేతలను, జగన్ అభ్యర్థులను అన్నిరకాలుగా తట్టుకునే వారిని సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడంలో కూడా చంద్రబాబు ఆలోచన అదే. వచ్చే ఎన్నికలలో గెలుపు అవసరం చంద్రబాబుకు ఎంత అవసరమో... ఆయన ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తుంది.


Tags:    

Similar News