Ambati Rayudu : రాయుడు గారు.. గాజు గ్లాసు... భళ్లున బద్దలయిపోతుందా?

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ను కలిశారు. ఆయనతో మూడు గంటల పాటు చర్చించారు

Update: 2024-01-10 12:18 GMT

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ను కలిశారు. ఆయనతో మూడు గంటల పాటు చర్చించారు. ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. అంబటి రాయుడు పదిహేను రోజుల క్రితం వైఎస్ జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కానీ కండువా కప్పుకున్న పది రోజుల్లోనే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే దానిపై పలు రకాలుగా కామెంట్స్ రావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ లో ఆడేందుకే రాజీనామా చేశానని ప్రకటించారు. క్రికెట్ ఆడాలంటే రాజకీయ పార్టీలలో ఉండకూడదని కూడా రాయుడు ట్వీట్ చేయడంతో ఆ వాదనకు ఇక తెరపడింది.

జనసేనానితో కలిసి...
మళ్లీ తాజాగా ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ను అంబటి రాయుడు కలవడంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టమవుతుంది. జనసేన కూడా బలమైన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాయుడిని జనసేనలోకి చేర్చుకుని ఎన్నికల బరిలోకి దించాలని యోచిస్తుంది. రాయుడిని గుంటూరు నుంచే బరిలోకి దింపడంపై జనసేన సీరియస్ గా ఆలోచిస్తుంది. టీడీపీలో పొత్తులో భాగంగా కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాకుండా పార్లమెంటు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అంబటి రాయుడితో మూడు గంటల పాటు సమావేశమయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మచిలీపట్నం నుంచి...
అయితే రాయుడు పేరు గుంటూరు లేదా మచిలీపట్నం స్థానాలకు పరిశీలనలో ఉందని జనసేన పార్టీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గుంటూరు, విజయవాడ పార్లమెంటు స్థానాలను సాధారణంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారినే పోటీకి దింపుతారు. గుంటూరులో గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అక్కడి కంటే రాయుడికి మచిలీపట్నమే సేఫ్ అని చెబుతున్నారు. అక్కడ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను అసెంబ్లీకి పంపాలన్న ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెట్టే అవకాశముందని కూడా తెలుస్తోంది. దీనివల్ల మచిలీపట్నంలోని యువత మాత్రమే కాకుండా కొన్ని సామాజికవర్గాల ఓట్లు సాలిడ్ గా కూటమి అభ్యర్థులకు పడతాయని కూడా జనసేన టీడీపీ అధినేత చంద్రబాబుకు నచ్చ చెబుతుందంటున్నారు.
కర్నూలు నుంచి...
అలాగే కర్నూలు నుంచి వైసీపీకి రాజీనామా చేసిన డాక్టర్ సంజీవ్ కుమార్ ను పార్టీలోకి తీసుకుని ఆ స్థానాన్ని కూడా రాయలసీమ నుంచి తమ ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తుంది. సంజీవ్ కుమార్ కూడా జనసేనలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. వైద్యుడిగా ఆయనకు ఉన్న మంచిపేరుతో పాటు చేనేత సామాజికవర్గం ఓట్లు ఆ పార్లమెంటు పరిధిలో అధికంగా ఉండటంతో కూటమికి కలసి వస్తుందని కూడా పవన్ భావిస్తున్నారు. మచిలీపట్నం, కర్నూలు, కాకినాడ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు పవన్ సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు ధీటైన అభ్యర్థుల అన్వేషణలో ఉన్నారు. అందుకే అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి అంబటి రాయుడు జనసేన తరుపున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.


Tags:    

Similar News