AP Politics : ఈ ముగ్గురికీ ఈ ఎన్నికలు కీలకమే... ఏమాత్రం తేడా జరిగినా ఇక అంతే

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు ముగ్గురు నేతల రాజకీయ జీవితాలకు కీలకంగా మారనున్నాయి

Update: 2024-02-12 06:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు ముగ్గురు నేతల రాజకీయ జీవితాలకు కీలకంగా మారనున్నాయి. ఒక ఎన్నిక - ముగ్గురి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఈ ఎన్నికల్లో కాస్త అటూ ఇటూ అయితే.. ఈ ముగ్గురు రాజకీయంగా ఫేడ్ అవుట్ కాక తప్పదు. వీళ్లను క్యాడర్ తో పాటు నేతలు కూడా ఇక నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే ఈ ఎన్నిక గెలుపోటములు ఈ ముగ్గురు రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఎన్నికలో గెలవడం కోసం.. లేదా తమ బలం ఇంత అని చెప్పుకోవడం కోసం ఈ ముగ్గురూ ప్రయత్నిస్తున్నారు. వాళ్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వేరే అనుమానాలకు కూడా అవకాశం లేదు.

జగన్, చంద్రబాబులకు మాత్రం...
ఎందుకంటే... చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు గెలుపోటములతో సంబంధం లేదు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ఆయనకంటూ వ్యక్తిగతంగా జరిగే నష్టం పెద్దగా ఉండదు. ఇప్పటికే ఏడు పదులు దాటిన చంద్రబాబు ఇదే చివరి ఎన్నికలు అని చెబుతున్నప్పటికీ ఫలితాలు ఎలా వచ్చినా ఆయనకు వచ్చిన ఇబ్బందులేమీ ఉండవు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకసారి అధికారాన్ని రుచి చూశారు. అలా ఇలా కాదు. ఏకంగా 151 స్థానాలను సాధించి తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఆయన కూడా ఈఎన్నికల్లో గెలిచినా ఓడినా రాజకీయంగా పెద్ద నష్టమేమీ ఉండదు. యువకుడే కావడంతో మరొకసారి పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఆయన పార్టీలోని నేతలకు, క్యాడర్ కు ఉంటుంది. అందుకే ఈ ఇద్దరు నేతలకు గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళ్లొచ్చు.

పవన్ కల్యాణ్ : పార్టీ పెట్టి పదేళ్లవుతుంది. ఇప్పటికి రెండు ఎన్నికల్లో పోటీ చేసినట్లవుతుంది. రెండుసార్లు కూటములతోనే ఆయన బరిలోకి దిగినట్లు. 2014లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతివ్వడంతో అది గెలిచిందని ఆయన భావిస్తుంటారు. అది భ్రమ లేదా? నిజమా?అన్నది ఇప్పుడు తేలనుంది. 2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ, కమ్యునిస్టులతో కలసి పోటీ చేసినా ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో రెండోసారి 2024లో టీడీపీతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓకే. కానీ అది జరగకుంటే మాత్రం ప్యాకప్ అని అనాల్సిందే. ఎందుకంటే పవన్ ను అభిమానులు, సొంత సామాజికవర్గమూ నమ్మడం లేదనే అనుకోవాల్సి ఉంటుంది. అందుకే పవన్ కు ఈ ఎన్నిక కీలకం అని స్పష్టంగా చెప్పొచ్చు.

నారా లోకేష్ : 2014కు ముందు ఆయన పార్టీ బ్యాక్ ఆఫీస్ లో పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2014లో పోటీ చేయకుండానే మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా మారి మంత్రి అయిన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు నాయకత్వానికి కూడా ఈ ఎన్నిక పరీక్ష. ఎందుకంటే ఆయన యువగళం పేరుతో ఏడాదకిపైగా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్సార్, చంద్రబాబు, జగన్ లు తమ పార్టీలను అధికారంలోకి తీసుకువస్తే ఈయన పాదయాత్ర అధికారంలోకి తేలేకపోయిందన్న అపవాదును ఎదుర్కొనాల్సి ఉంటుంది. టీడీపీ భావినేత లోకేష్ కు ఈ ఎన్నికలు కీలకం. ఒకవేళ అధికారంలోకి రాకపోతే లోకేష్ ను నాయకులు నమ్మే పరిస్థితి ఉండదు. గెలిస్తే మాత్రం తన పాదయాత్ర గెలిపించిందని చెప్పుకునే వీలుంటుంది.

వైఎస్ షర్మిల : వైఎస్ షర్మిల ఇప్పటికే తెలంగాణలో విఫలమయిన నాయకురాలుగా ముద్రపడ్డారు. వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. గతంలో పాదయాత్ర చేసి, తన సోదరుడు జగన్ కు మద్దతుగా ప్రచారం చేసి వైసీపీని గెలిపించానని చెప్పుకునే షర్మిలకు ఈ ఎన్నిక కీలకం. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టి ఊరూరా తిరుగుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అయితే కనీసం జగన్ ను ఓడించగలిగినా ఆమె సక్సెస్ అయినట్లే. లేకపోతే మాత్రం ఆయన ఇక తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా చాప చుట్టేయక తప్పనిపరిస్థితులు నెలకొంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఈ ముగ్గురి నేతలకు రాజకీయ భవిష్యత్ ను నిర్దేశిస్తాయి.


Tags:    

Similar News