YSRCP : ఆళ్లతోనే ఆగుతుందా... వైసీపీలో ముసలం మొదలయిందా?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో అంతర్మధనం మొదలయింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఇది అర్థమయింది

Update: 2023-12-11 07:31 GMT

ys jagan

ఊహించిందే జరుగుతుందా... జగన్ పార్టీలో జగడం మొదలయిందా.. రానున్న కాలంలో మరిన్ని వార్తలు వినబోతున్నామా... ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కూడా రాజీనామా చేస్తారా? ప్రస్తుతం వైసీీపీలో ఇదే చర్చ మొదలయింది. జగన్ కు అత్యంత విధేయుడు.. నమ్మకస్థుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఈ అనుమానం మరింత బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మార్చి నెలలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. అంటే జగన్ పాలనకు కేవలం తొంభయి రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో మరింత మంది నేతలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశముందన్న హెచ్చరికలు అందుతున్నాయి.

ఎవరికి ఇష్టం?
ఏ నేత నియోజకవర్గాన్ని వదులుకునేందుకు సిద్ధపడరు. తనంతట తానుగా వదిలిపెట్టడు. జనం తీర్పుతో ఓటమి పాలయితే తప్ప నియోజకవర్గానికి దూరం కావాలని యత్నించడు. అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నా దానిని వ్యతిరేకిస్తారు. తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో మరొకరి పెత్తనానికి ఎవరు మాత్రం ఇష్టపడి.. జగన్ పై అభిమానంతో తలూపి వెళ్లిపోతారు. ఎవరూ వెళ్లరు. జగన్ నుంచి ఎమ్మెల్యే వరకూ ఎవరి స్థాయిలో వారికి పదవి ముఖ్యం. అంతే తప్ప తనను తప్పించడానికి ఏమాత్రం ప్రయత్నాలు చేసినా అందుకు అంగీకరించడు. అవసరమైతే ఎదురుతిరుగుతాడు. ఇది జగన్ పార్టీలోనే కాదు. ఏ పార్టీలోనైనా కామన్ గా కనిపించే అంశమే. అందుకు జగన్ ప్రత్యేకమేమీ కాదు.
కొందరికి టిక్కెట్లు రావంటూ...
గడప గడపకు ప్రభుత్వం సమీక్ష సమావేశాల్లో కొందరికి టిక్కెట్లు రావని కూడా జగన్ నేరుగా స్పష్టం చేశారు. అయినా వాళ్లంతా తన వాళ్లేనని చెప్పుకొచ్చారు. నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లోనే పోటీకి దూరమని చెప్పినా జగన్ వినలేదు. ఆళ్లకే టిక్కెట్ ఇచ్చారు. పైగా ఎన్నికల ప్రచారంలో ఆళ్లను గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదు. కేవలం సామాజికవర్గం బూచిగా చూపి ఆయనను కేబినెట్‌కు దూరం పెట్టేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కోసం ఉన్నవారిని... నమ్మకమైన నేతలను పోగొట్టుకోవడానికి జగన్ సిద్ధపడినట్లు వైసీపీలో గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమిస్తారని తెలుసుకున్న ఆళ్ల ముందుగానే రాజీనామా చేశారు.
పదవులు అంటే...
ఇప్పుడు ఆళ్ల వంతయింది. ఇక చాలా మంది అదే బాటలో పయనించే అవకాశం ఉంటుంది. ఎవరూ జగన్ కోసం తమ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉండరు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఎంత ముఖ్యమో ఎమ్మెల్యేలకు వారి పదవి అంతే ప్రాధాన్యం. అవసరం కూడా. అవసరమైతే పార్టీని వీడి మరొక పార్టీలో చేరి పోటీ చేస్తారు తప్పించి లాయల్టీ అన్నది రాజకీయాల్లో కనిపించని దృశ్యమనే అనుకోవాలి. అందుకే జగన్ కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. తనను దూరం చేసుకుని ఎక్కడికీ పోలేరులే అని మొండికి పోతే ఆళ్ల తరహాలోనే మరికొందరు కూడా రాజీనామాకు సిద్ధపడతారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఆళ్ల రామకృష్టారెడ్డి రాజీనామా వ్యవహారాన్ని చక్కదిద్దుకోగలిగితే సరి. లేకుంటే పెద్ద డ్యామేజీ అనుకోవాలి. ఏమవుతుందిలే అని పట్టుదల.. పంతానికి జగన్ వెళితే మాత్రం ముందున్నవన్నీ సమస్యలేనని చెప్పకతప్పదు.


Tags:    

Similar News