Janasena, tdp : జెండాలు కలిశాయి సరే.. క్యాడర్ మాటేమిటి మాస్టారూ?

ఉమ్మడి మ్యానిఫేస్టోను రూపొందించాలని టీడీపీ, జనసేన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Update: 2023-10-23 11:51 GMT

జెండాలయితే కలిశాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీిని ఎదుర్కొనడానికి రెండు పార్టీలూ ఏకమయ్యాయి. నేతలు కూడా ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకున్నారు. చూసేందుకు సీన్ అదిరిపోయింది. ఇంకేముంది అధికారంలోకి వచ్చేనట్లేనని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. రెండు పార్టీల నాయకత్వం కూడా అదే భావనలో ఉంది. రాజమండ్రిలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఉమ్మడి మ్యానిఫేస్టోను రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో టీడీపీ ఇప్పటికే విడుదల చేసిన సూపర్ సిక్స్, మేనిఫేస్టో వంటి అంశాలపై చర్చించనట్లు తెలిసింది.


ఉమ్మడి మేనిఫేస్టోను...

చంద్రబాబు 43 రోజుల నుంచి రాజమండ్రి జైలులో ఉండటంతో నారా లోకేష్, పవన్ కల్యాణ్ సారధ్యంలో ఈ సమావేశం జరిగింది. టీడీపీ తొలి విడత చేసిన మ్యానిఫేస్టోను అంగీకరించిన జనసేన మరికొన్ని అంశాలతో మ్యానిఫేస్టోను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండు పార్టీలూ కామన్ మినిమిమ్ ప్రోగ్రామ్ ద్వారానే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. జనసేన కూడా ఉమ్మడి మేనిఫోస్టోలో కొన్ని అంశాలను చేర్చడానికి సిద్ధమయిందని, అందుకు టీడీపీ కూడా అంగీకరించిందని తెలిపింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ వివిధ సభల్లో ఇచ్చిన హామీలను ఉమ్మడి మ్యానిఫేస్టోలో చేర్చాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఉమ్మడి కార్యాచరణను...
దీంతో పాటు ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఇకపై రోడ్డుపైకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే రెండు జెండాలు కనపడేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వంపై ఉమ్మడి ఛార్జిషీట్ ను కూడా విడుదల చేయడానికి టీడీపీ, జనసేన రెండు సిద్ధమవుతున్నాయి. ఒక సమావేశంలో నిర్ణయానికి వచ్చే కన్నా మరికొన్ని సమావేశాల ద్వారా సమిష్టి నిర్ణయంతోనే ముందుకు వెళ్లాలని ఇరు పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. జగన్ ను ఎదుర్కొనాలంటే ఓట్లు చీలకుండా కలసి ప్రచారం చేసే దానిపై కూడా ఒక కార్యాచరణను రూపొందించుకోవాలని సమావేశంలో సూచించినట్లు సమాచారం.

ఇద్దరూ కలసి...
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కలసి పవన్ కల్యాణ్ కూడా పలు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. మూడు ప్రాంతాల్లో మూడు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, అందులో ఇద్దరూ పాల్గొనేలా చూడాలని పలువురు నేతలు చేసిన సూచనలకు సమావేశం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. నేతలు కలిశారు. జెండాలు కూడా కలసి పోయాయి. కానీ క్యాడర్ ఏ మేరకు సహకరిస్తారన్న దానిపై ఉన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓటు బ్యాంకు ఒకరికొకరు బదిలీ అయ్యేలా సహకరించేందుకు ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేయాలన్న ఆలోచనలో మరోసారి సమావేశం కావాలని నేతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Tags:    

Similar News