జగనూ... జనం అలా చెబితే నమ్ముతారా

చంద్రబాబు అరెస్ట్‌తో తనకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ జగన్ చెప్పడంపై కామెంట్స్ వినపడుతున్నాయి

Update: 2023-10-10 03:42 GMT

చంద్రబాబు అరెస్ట్‌తో తనకు ఏమాత్రం సంబంధం లేదని, తాను లండన్‌లో ఉండగా చంద్రబాబును అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ నిన్న జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో చెప్పారు. తనకు సంబంధం లేకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఆయన చెప్పుకుంటూ వెళ్లారు. కానీ జనం దానిని నమ్ముతారా? జగన్‌కు తెలియకుండానే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే నమ్మే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఘాటుగా వినిపిస్తున్నాయి. జగన్ చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థిితి లేదని, తాను ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదన్నది అందరికీ తెలుసునని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచంలో ఎక్కడున్నా…
జగన్ ఏపీకి ముఖ్యమంత్రి. ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో జరిగే ప్రతి కీలక పరిణామం ఆయనకు తెలియకుండా జరగదు. చీమ చిటుక్కుమన్నా ఆయనకు సమాచారాన్ని అధికారులు అందచేస్తారు. అందునా ముఖ్యంగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడమంటే అధికారులు ఆషామాషీగా తీసుకునే నిర్ణయం కాదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ లేకుండా చంద్రబాబును టచ్ చేసే ధైర్యం అధికార యంత్రాంగం చేయదన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. జగన్ లండన్ లో ఉన్నప్పుడు జరిగినా ఆయన అరెస్ట్, తదనంతర పరిణామాలను తెలిపే అధికారులు అడుగు ముందుకు వేశారన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా వినిపిస్తుంది.
పార్టీకి ఇబ్బందికరమైన…
చంద్రబాబు అరెస్ట్‌తో పెద్దగా సానుభూతి లభించలేదని జగన్ అన్నారు. అందులో ఎంత నిజముందన్నది పక్కన పెడితే 73 ఏళ్ల వయసులో సీబీఎన్ ను అరెస్ట్ చేయడం కొంత పార్టీకి ఇబ్బంది కరమైన పరిణామమేనని చెప్పకతప్పదు. ప్రధానంగా మధ్యతరగతి, యువత, ఉద్యోగవర్గాల ఓట్లు కొంత వ్యతిరేకమయ్యే అవకాశాలున్నాయన్నది వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్న అంశం. జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ మాట అన్నారే తప్ప సానుభూతి ఎంతో కొంత ఉంటుందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అంతేకాదు అయితే అది ఏస్థాయిలో ఉంటుందన్నది చెప్పలేం కాని కొంత మేర జనం ఆలోచిస్తారన్నది కాదనలేని వాస్తవం.
పోలింగ్ కేంద్రం వరకూ…
చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కాని అసలు విషయం స్పష్టం కాదు. చంద్రబాబును బీజేపీతో కలసి జగన్ ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేయించిందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ తనకు తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగిందని చెప్పినా అది వినే పరిస్థితిలో జనం లేరన్నది వాస్తవం. కానీ జగన్ తాను చెప్పాలి కాబట్టి చెప్పారు తప్పించి అంతకు మించి మరొకటి లేదన్నది యదార్ధం. అయితే వచ్చిన సానుభూతిని టీడీపీ, జనసేన కూటమి ఏ మేరకు నిలుపుకుని పోలింగ్ కేంద్రాల వరకూ తీసుకెళతాయన్నది కూడా పెద్ద ప్రశ్నేనని చెప్పక తప్పదు. మొత్తం మీద జగన్ తనకు తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్న కామెంట్స్ ను మాత్రం జనం నమ్మే అవకాశలే లేవు.


Tags:    

Similar News