Jc Brothers : జగన్ కు తెలియకుండానే చంద్రబాబుకు మంచి చేసినట్లేనా?

ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ తన పాలనలో చంద్రబాబుకు మాత్రం ఒక మంచి పని చేసినట్లే కనపడుతుంది.

Update: 2024-02-22 12:43 GMT

ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ తన పాలనలో చంద్రబాబుకు మాత్రం ఒక మంచి పని చేసినట్లే కనపడుతుంది. పార్టీలో టిక్కెట్లు దక్కకపోయినా మొండిపట్టు పట్టే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. సర్దుకుపోదాం అనే రీతిలో టీడీపీ నేతలు వచ్చారంటే దానికి చంద్రబాబు కంటే జగన్ కారణమని చెప్పాలి. ఈ ఐదేళ్ల పాలనలో ఏ నియోజకవర్గంలోనూ టీడీపీ నేతకు వైసీపీ ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా చేసింది. రోడ్డు మీదకు వస్తే కేసులు పెట్టి లోపల పడేయడమే. అందుకే అనేక మంది నేతలు తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా జైలు పాలయ్యారు. టీడీపీలో పదుల సంఖ్యలో నేతలు అనేక కేసులు ఈ ఐదేళ్లలో ఎదుర్కొనడమే కాకుండా ఊచలు లెక్కలు పెట్టి ఎలాగోలా బెయిల్‌పై బయటపడ్డారు.

జైలు పాలు కావడంతో...
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, దేవినేని ఉమ, దూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర ఇలా ఒకరేమిటి చెప్పుకుంటూ పోతే ఎందరో నేతలు జైలుకు వెళ్లి వచ్చారు. దీంతో మిగిలిన నేతలు బయటకు రావడానికే భయపడ్డారంటే అతిశయోక్తికాదు. ఒక దశలో టీడీపీ పరిస్థితి ఇలా తయారయిందేందన్న భావన ఆ పార్టీ కింది స్థాయి కార్యకర్తల్లో కలిగింది. బయటకు వస్తే కేసులు పెడుతుండటంతో ఎందుకొచ్చిన గొడవ అని భావించి మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ వంటి వాళ్లు అయితే హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. వారి వ్యాపారాలను చూసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా పక్కన పెట్టారు.
ధీటుగా ఎదుర్కొన్న...
అనంతపురంలోనూ పరిటాల కుటుంబం, జేసీ ఫ్యామిలీ మాత్రం ఒకింత యాక్టి‌‌వ్ గానే తొలి నుంచి కనిపించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాలకు రెండేసి టిక్కెట్లు గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. పరిటాల కుటుంబం నుంచి రాప్తాడుకు పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయాలని భావించారు. ధర్మవరానికి శ్రీరామ్ ను చంద్రబాబు ఇన్‌ఛార్జిగా నియమించారు. అలాగే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం వైసీపీని ధీటుగా ఎదుర్కొన్నారు. తాను అరెస్టయినా కూడా పెద్దగా బాధపడలేదు. ఆయన సవాల్‌కు ప్రతి సవాల్ విసురుతూ తాడిపత్రి టీడీపీ క్యాడర్ లో ధైర్యాన్ని నూరిపోశారంటే నిజమనే చెప్పాలి.
ఒక కుటుంబానికి...
కానీ ఇప్పడున్న పరిస్థితుల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే నినాదాన్ని బయటకు తీసుకు వచ్చారు. జేసీ కుటుంబానికి తాడిపత్రి అసెంబ్లీ సీటు, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ కోరారు. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం పార్లమెంటు నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేకపోయినా తాము సర్దుకుపోతామని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారంటే చంద్రబాబు నిర్ణయం ఫైనల్ అని చెప్పేయడమే. తమకు రెండు సీట్లు దక్కించుకోవడం కన్నా, జగన్ ను గద్దె దింపడమే లక్ష్యమని వారు భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నేత మనసులోనూ ఇదే పరిస్థితి. అందుకే జగన్ తనకు తెలియకుండానే చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో మంచి పని చేసినట్లయింది.


Tags:    

Similar News