Pawan, BJP : పట్టున్న పవన్ కంటే.. బలం లేని బీజేపీ బెటర్ అని అనుకోవాలా బాసూ?

బీజేపీ పట్టుబట్టి పది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది.

Update: 2024-03-13 05:39 GMT

అవును... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ విన్నా ఇదే చర్చ. అసలు బలం లేని బీజేపీ మాత్రం పట్టుబట్టి పది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. బెట్టు చేసి మరీ పంతాన్ని నెగ్గించుకుంది. అవసరం ఇద్దరికీ ఉంది. కానీ ఎక్కువ అసవరం తమ కన్నా మీకే అన్న సంకేతాలను భారతీయ జనతా పార్టీ నాయకత్వం బలంగా పంపగలిగింది. కానీ బీజేపీ కంటే బలముండి.. పవన్ అండ అవసరం ఎక్కువగా ఉన్నప్పుటికీ జనసేనాని మాత్రం తెలుగుదేశం పార్టీకి లొంగిపోయాడన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బీజేపీకి ఉన్న దూర దృష్టి కూడా పవన్ కల్యాణ్ కు లేకపోవడం తమ దురదృష్టమంటూ జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు.

టీడీపీకి చావో రేవో....
నిజానికి ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో. అతి ముఖ్యమైన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను కలుపుకుని వెళ్లడం తెలుగుదేశం పార్టీకి అవసరం కూడా. జగన్ ను ఎదుర్కొనాలన్నా, బలమైన కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకును తమ వైపునుకు తిప్పుకోవాలన్నా పవన్ కల్యాణ్ అవసరమే టీడీపీకి ఎక్కువగా ఉంది. అందుకే తొలి నుంచి జనసేన పార్టీ నేతలు ఈసారి ఎక్కువ స్థానాలు తమకు దక్కుతాయని భావిస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్ కూడా తరచూ తనకంటూ ఒక వ్యూహం ఉందని చెబుతుండటంతో పిచ్చిగా నమ్మేశారు. కానీ చివారఖరకు మాత్రం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేస్తామని చెప్పడంతో నేతలు, క్యాడర్ నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా తగ్గించుకున్నారు.
నోటా కంటే...
మరోవైపు బీజేపీకీ ఏపీలో నోటా కంటే ఎక్కువ ఓట్లు లేవు. పైగా కాంగ్రెైస్ తరహాలోనే బీజేపీకి కూడా ఇక్కడ బలమైన నేతలు కూడా లేరు. కానీ కేంద్రంలో అధికారంలో ఉండటం, మళ్లీ మోదీ సర్కార్ వస్తుందన్న అంచనాలు మాత్రమే దానిని సీట్ల కోసం డిమాండ్ చేసేలా నిలబెట్టాయి. ఢిల్లీలో దాదాపు మూడు రోజులు మకాం వేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సీట్ల సర్దుబాటు చేసుకుని వచ్చారు. సరే... బలం లేని బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వడమేంటన్న చర్చ టీడీపీ, జనసేన పార్టీల్లో జరుగుతుంది. పడిగాపులు కాచి మరీ పొత్తు కన్ఫర్మ్ చేసుకుని బలానికి మించి బీజేపీ ఎక్కువ సీట్లను ఇచ్చారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. కేవలం అంకె మాత్రమే కాదు.. టీడీపీ, జనసేన బలమున్న స్థానాలను కూడా ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలియవచ్చింది.
ఇలాంటి సమయం...
బీజేపీతో అవసరానికి మించి సీట్ల సర్దుబాటు చేసుకున్నారన్న వ్యాఖ్యలు రెండు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికపరంగా ఆ పార్టీకి బలమైన నేతలు లేరు. అలాగే క్రౌడ్ పుల్లర్లు కూడా ఎవరూ లేరు. అయినా సరే.. బీజేపీ పట్టుబట్టి మరీ సీట్లను సాధించుకుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన అవసరం టీడీపీకి ఉన్నా, బలమైన ఓటు బ్యాంకును భుజాన పెట్టుకుని ఉన్నప్పటికీ కనీస స్థానాలను సాధించడంలో విఫలమయ్యారన్నది వాస్తవం. అదే ఇప్పుడు కాపు సామాజికవర్గంలో పవన్ కు మైనస్ గా మారబోతుందంటున్నారు. డిమాండ్ చేసి మరీ సాధించుకోవాల్సిన ఇలాంటి సమయం మరెప్పుడూ పవన్ కల్యాణ‌్ కు రాదన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద పట్టున్న పవన్ కల్యాణ్ కంటే.. బలం లేని బీజేపీయే బెటర్ అంటూ నెట్టింట ఆ పార్టీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.


Tags:    

Similar News