గీత దాటొద్దు.. నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్, రేవంత్ సక్సెస్.?

ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని.. మీడియా ముందు మాట్లాడొద్దంటూ రాహుల్ గాంధీ హెచ్చరికలు చేశారు.

Update: 2022-05-07 14:41 GMT

others

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అగ్రనేత, ఏఐసీపీ నాయకుడు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడొద్దని.. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. అనవసరంగా మీడియాకు ఎక్కితే ఉపేక్షించేది లేదని రాహుల్ హెచ్చరికలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల టీకాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పలువురు నేతలు బాహాటంగానే విమర్శలు చేసుకుంటూ అధిష్టానానికి తలనొప్పిగా మారారు.

సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీనియర్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తొలి నుంచీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇటీవల వరంగల్ సభ సన్నాహక సమావేశానికి ముందు కూడా కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాకు బయటి నుంచి ఎవరూ రానక్కర్లేదని.. తాము చూసుకుంటామంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌కి పరోక్షంగా చురకలంటించారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అయినప్పటికీ రేవంత్ నాగార్జునసాగర్‌లో సన్నాహక సమావేశం నిర్వహించి తన పంతం నెరవేర్చుకున్నారు.

అంతకు ముందు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కూడా రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు. తనను కోవర్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తూ అవమానిస్తున్నారంటూ ఏకంగా రాజీనామాకు కూడా సిద్ధపడిపోయారు. అయితే సీనియర్ నేతల సూచనలతో కాస్త వెనక్కి తగ్గారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం జగ్గా రెడ్డి కాస్త శాంతంగానే కనిపిస్తున్నారు. రేవంత్‌తోనూ అభిప్రాయభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. రాహుల్ పర్యటనకు సంబంధించిన పనుల్లో ఇద్దరూ కలిసి పనిచేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు సద్దుమణిగినట్టేనన్న సంకేతాలిచ్చారు.

మరోవైపు వీహెచ్ లాంటి సీనియర్ నేతలు కూడా తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ పీసీసీపై గుస్సా అవుతున్నారు. తాను ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఇప్పటికే పలుమార్లు ఆయన హెచ్చరించారు కూడా. అటు అద్దంకి దయాకర్ ప్రెస్‌మీట్ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చర్యల వరకూ వెళ్లింది. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ హెచ్చరికలు హాట్ టాపిక్‌గా మారాయి. మీడియాకెక్కి రచ్చచేయొద్దంటూ అగ్రనేత రాహుల్ గాంధీతో చెప్పించడం ద్వారా పార్టీ లైన్ దాటకుండా సీనియర్ నేతలను కట్టడి చేయడంలో రేవంత్ ఒకింత సక్సెస్ అయినట్టే చెప్పొచ్చు.

అంతేకాకుండా రాహుల్ గాంధీ పార్టీ టిక్కెట్లపై కూడా క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కూర్చుంటేనో.. ఢిల్లీ చుట్టూ తిరిగితేనో టిక్కెట్లు ఇచ్చేది లేదని.. ప్రజల మధ్యలో ఉండే నాయకులకే టిక్కెట్ ఇస్తామని తేల్చిచెప్పేశారు. సీనియర్ నేతలైనా ప్రజల మధ్యలో తిరగాల్సిందేనని.. సర్వేలు నిర్వహించి ప్రజామోదం ఉన్నవారికే టిక్కెట్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని.. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే ఆ పార్టీలోకే వెళ్లిపోవాలంటూ అల్టిమేటం ఇచ్చేశారు. దీంతో అసమ్మతి నేతలకు బుజ్జగింపులు లేవని.. వెళ్లిపోయినా ఏం ఫర్వాలేదంటూ తేల్చిచెప్పినట్టైంది.


Tags:    

Similar News