Vice Presidential Election : గెలుపు తెలిసినా... ఓట్లు కలవరం రేపుతున్నాయటగా?

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎన్డీఏ తరుపున సీపీ రాధాకృష్ణన్, ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు

Update: 2025-09-09 02:26 GMT

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎన్డీఏ తరుపున సీపీ రాధాకృష్ణన్, ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం ఖాయమైంది. గెలవాలంటే 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం పార్లమెంటు ఉభయసభల్లో ప్రస్తుతం 781 మంది సభ్యులుండగా వీరిలో పాలక కూటమి సంఖ్య 425, ఇండి 311, ఇతరులకు 45 మంది ఉన్నారు. క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే అది ఎంత మేరకు పనిచేస్తుందన్నది చూడాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇంకా నిర్ణయించుకోని వారు ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఏదైనా కిరికిరి చేస్తే తప్ప ఇండి కూటమి అభ్యర్థి విజయం సాధ్యం కాదు.

క్రాస్ ఓటింగ్ పైనే...
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే కూటమిలో లేని ఆమ్ ఆద్మీ పార్టీ వంటివి మద్దతు ప్రకటించాయి. బీజేడీ కూడా తనకు మద్దతు ప్రకటిస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన ఆత్మప్రభోధం మేరకు ఓటు వేయాలని, వ్యక్తిత్వం, బ్యాక్ గ్రౌండ్ చూసి ఓటు వేయాలని పదే పదే కోరుతున్నారు. అయితే లెక్కలు మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ కనిపిస్తుంది. ఇండి కూటమిలోని అగ్రనేతలకు కూడా ఇది తెలిసినప్పటికీ రాజ్యాంగ బద్ధమైన పదవి కావడంతో పాటు జగదీప్ థన్ ఖడ్ ను పదవి నుంచి బీజేపీ తప్పించిందన్న ప్రచారం క్రాస్ ఓటింగ్ వైపునకు దారితీస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు అన్నింటిలోనూ మంచి మార్కులు సంపాదించుకున్న వారే.
భవిష్యత్ కు ఇది...
ఈ ఎన్నికలో ఓటమి పాలయినా తమ అభ్యర్థికి గతంలో కంటే ఎక్కువ ఓట్లు వస్తే తమ బలం పెరిగిందని చెప్పుకునే వీలు ఇండి కూటమిలో ఉంది. అది తమ కూటమిలోని ఇతర పార్టీలు మరింత యాక్టివ్ కావడానికి, ఇండి కూటమిలోకి మరికొన్ని పార్టీలు చేరడానికి ఉప రాష్ట్రపతి ఎన్నిక ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. అందుకే రాజకీయాలతో సంబంధం లేని జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపారు. గతంలో 2002లో సుశీల్ కుమార్ షిండేకు 305 ఓట్లురాగా, నాడు బైరాన్ సింగ్ షెకావత్ కు 454 ఓట్లు వచ్చాయి. అదే ఇప్పటి వరకూ వరకూ జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మంచి పోరు. దానిని అధిగమించి ఈసారి అత్యధికంగా ఓట్లు సాధిస్తామన్ననమ్మకంతో ఇండి కూటమి ఉంది. గెలుపు ముఖ్యమని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. సాయంత్రానికి ఉప రాష్ట్రపతి ఎవరన్నది తేలనుంది.


Tags:    

Similar News