Delhi Assembly Elections : ఢిల్లీలో గెలుపు ఎవరిదంటే? విశ్లేషణలు ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలూ తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాయి

Update: 2025-01-25 12:33 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది రోజులు సమయం మాత్రమే ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలూ తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీలూ నిమగ్నమయ్యాయి. పైకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరులా కనిపిస్తున్నప్పటికీ ద్విముఖ పోటీ జరుగుతుందన్నది విశ్లేషకుల అంచనా. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది మాత్రం అంచనాకు అందడం లేదు. మరోసారి ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేకపోతున్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీల మధ్య గట్టి పోటీ ఉండటంతో పాటు కాంగ్రెస్ కొన్ని కీలక స్థానాల్లో బలంగా ఉండటమే ఈ అనుమానాలకు ప్రధాన కారణం. ఎవరు గెలిచినా గత ఎన్నికల ఫలితాలు మాత్రం ఉండవన్నది సుస్పష్టం. అంటే ఏ పార్టీకి ఏకపక్షంగా ఓట్లు వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఉచిత పథకాలను...

మూడు ప్రధాన పార్టీలూ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉచిత పథకాలను ప్రకటిస్తూ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఢిల్లీ పరిధిలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో మ్యాజిక్ ఫిగర్ 36 మాత్రమే. అయితే గతంలోనూ అంటే 2013లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కాంగ్రెస్ మద్దతుతోనే నాడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం 49 రోజులకే తిరిగి ఎన్నికలకు వెళ్లి ఆయన ఒంటరిగా గెలిచారు. తర్వాత 2015, 2020లో జరిగిన ఎన్నికల్లోనూ వన్ సైడ్ విజయం సాధించారు. అయితే కేజ్రీవాల్ పార్టీపై అవినీతి మరకలు పడటంతో పాటు బీజేపీ గతంలో కంటే బలం పుంజుకోవడం వంటివి మాత్రమే కాకుండా కాంగ్రెస్ ఓట్లు చీలిపోతే అది బీజేపీకి లబ్ది చేకూరుతుందన్న వాదనలు కూడా లేకపోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీకి ఓట్లు టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విశ్లేషణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అయిన ఆమ్ ఆద్మీపార్టీహ్యాట్రిక్ విజయాలను సాధించిది.
రెండు పార్టీలూ...
కాంగ్రెస్, బీజేపీలో దీర్ఘకాలంగా అంటే 2013 నుంచి దశాబ్దకాలం నుంచి అధికారం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పదేళ్ల కాలంలో బీజేపీ బలం పుంజుకుంది. మరోవైపు కేంద్రంలో మోదీ సర్కార్ మూడో సారి అధికారంలోకి రావడంతో ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తమకు ప్రయోజనం అని భావించి ఓటు వేస్తారని నమ్ముతుంది. పక్కనే ఉన్న హర్యానా, యూపీలలో కూడా బీజేపీ ఉండటం కొంత కలసి వచ్చే అంశంగా చూస్తున్నారు. అయితే దేశ రాజధాని కావడం అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తుండటం, చదువుకున్న వారు ఎక్కువగా ఉండటంతో ఆమ్ ఆద్మీపార్టీ ఆశలు మాత్రం నాలుగో సారి విజయం కూడా తమదేనని గట్టిగా విశ్విసిస్తుంది. తాము పదేళ్ల నుంచి అమలు చేస్తున్న పథకాలు, ప్రజలకు అందిస్తున్న అవినీతి రహిత పాలన తమను మరోసారి అందలం ఎక్కిస్తాయని కేజ్రీవాల్ అండ్ టీం ఆశిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకివచ్చినా తక్కువ స్థానాలకే పరిమితం చేయగలగడంతో కాంగ్రెస్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలతో ఉంది.


Tags:    

Similar News