గుడిలో దొంగతనం.. తిరిగి ఇచ్చేస్తూ, క్షమాపణలు చెబుతూ లేఖ పంపించాడు

Update: 2022-10-30 09:10 GMT

తప్పులు చేయడమన్నది మానవుల నైజం. ఆ తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరడం గొప్పతనం. ఓ వ్యక్తి గుడిలో దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్నాడు. దీంతో దొంగిలించిన వస్తువులను తిరిగి ఇచ్చేసి.. క్షమాపణ కోరుతూ లేఖను పంపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని ఒక ఆలయంలో దొంగిలించిన వెండి, ఇత్తడి వస్తువులను ఒక దొంగ తిరిగి ఇచ్చేశాడు. తాను చేసిన ఈ పని కారణంగా తనకు ఎంతో బాధ కలిగించిందని క్షమాపణ లేఖతో పాటు తిరిగి ఇచ్చాడని పోలీసులు తెలిపారు. అక్టోబరు 24న లమ్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినాథ్ దిగంబర్ జైన్ టెంపుల్ నుంచి 'ఛత్రాలు', మూడు ఇత్తడి వస్తువులతో సహా 10 అలంకారమైన వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విజయ్ దాబర్ తెలిపారు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

శుక్రవారం, ఒక జైన కుటుంబ సభ్యులు లామ్టాలోని పంచాయితీ కార్యాలయం సమీపంలోని గోతిలో పడి ఉన్న బ్యాగ్‌ను గుర్తించి, వారు పోలీసులను అప్రమత్తం చేసినట్లు అధికారి తెలిపారు. చోరీకి గురైన వస్తువులు బ్యాగ్‌లో కనిపించాయి. దొంగ క్షమాపణ లేఖ కూడా అందులో ఉంది. లేఖలో "నా చర్యకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను తప్పు చేసాను, నన్ను క్షమించండి. దొంగతనం తర్వాత నేను చాలా బాధపడ్డాను." అని అందులో ఉన్నారు.


Tags:    

Similar News