నిజాన్ని బయటపెట్టే బ్లాక్ బాక్స్.. అధికారుల చేతుల్లో
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు మొదలైంది
Black box
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు మొదలైంది. బ్లాక్స్ బాక్స్ లోని డేటాను విశ్లేషించనున్నారు అధికారులు. డీజీసీఏ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 12, మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్‌లోని రన్‌వే 23 నుంచి విమానం గాల్లోకి ఎగిరింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే పైలట్లు 'మేడే' కాల్ జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయి కుప్పకూలింది.
అధికారులు, ఘటనా స్థలంలో విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానాల్లో అమర్చే 'బ్లాక్ బాక్స్' నారింజ రంగులో ఉండే ఒక ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరం. ప్రమాదం జరిగిన తర్వాత దీనిని స్వాధీనం చేసుకొని, విమానం చివరి క్షణాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ బ్లాక్ బాక్స్‌ను టైటానియం లోహంతో తయారుచేస్తారు. దీనిని మరో టైటానియం పెట్టెలో భద్రపరుస్తారు. మంటలు, తీవ్రమైన ప్రమాదాలను కూడా ఇది తట్టుకోగలదు. ఈ పెట్టెలో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ విమాన ప్రయాణ సమయంలో దాని సాంకేతిక పనితీరుకు సంబంధించిన డేటాను నమోదు చేస్తుంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిపిన సంభాషణలను రికార్డ్ చేస్తుంది.