Terror attack: ఉగ్రవాదులు తెగపడింది ఇలా.. పర్యాటకులే టార్గెట్ గా?

అదను చూసి ఉగ్రవాదులు పర్యాటకులపై తెగపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది

Update: 2025-04-23 03:13 GMT

అదను చూసి ఉగ్రవాదులు పర్యాటకులపై తెగపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు ముప్ఫయి మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అతి పెద్ద ఉగ్రవాది దాడి ఘటనగా దీనిని పేర్కొనవచ్చు. పక్కా ప్రణాళికతో ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను సులువుగా తీసేశారు. సహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాపు కాసి మరీ పర్యాటకులపై పడ్డారు. ఈ దాడిలో మరో ఇరవై మందికిపైగానే గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా మారింది. పర్యాటకులను వెంటనే హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

అతి పెద్ద ఘటన...
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అది పెద్ద ఘటన ఇదేనని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం మారింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే వారిని చంపేశారు. పేర్లు అడిగి మరీ హిందువులని తేలితే చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రదాడిలో పాల్గొన్న ఒక టెర్రరిస్ట్ ఫొటో మాత్రం బయటకు వచ్చింది.
వారిపనే అది...
త్వరలో ముప్ఫయి ఎనిమిది రోజుల పాటు అమర్నాధ్ యాత్ర ప్రారంభం కానుంది. జులై 3వ తేదీ నుంచి ప్రారంమయ్యే అమర్ నాధ్ యాత్రకు ముందు ఈ ఘటన జరగడంతో ఈ ప్రభావం యాత్రపై పడే అవకాశముంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం మార్గంలోనే 48 కిలో మీటర్లు ఉండగా.. 14 కిలోమీటర్ల మార్గం గండేర్బల్ జిల్లా నుంచి ఉంటుంది. అయితే ఈ ఉగ్రదాడికి తెగబడింది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని తమకు తామే ప్రకటించుకుంది. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారు. అయితే వారి కోసం గాలింపు చర్యలను భద్రతా దళాలు ముమ్మరం చేశాయి.


Tags:    

Similar News