Operation Sindoor : కాల్పులే ఆగాయ్... బాంబుల మోత వినిపించలేదు
గత కొద్దిరోజుల నుంచి సరిహద్దు రాష్ట్రాల్లో తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సమసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి
గత కొద్దిరోజుల నుంచి సరిహద్దు రాష్ట్రాల్లో తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సమసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా - పాకిస్తాన్ ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నడుమ మూడు రోజుల పాటు కాల్పుల మోతతో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ లలో ప్రజలు వణికిపోయారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంట కూడా కాల్పుల మోత మోగింది. అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో శనివారం దానిని ఉల్లంఘించిన పాక్ ఆదివారం మాత్రం మౌనంగానే ఉంది. భారత్ సరిహద్దు ప్రాంతం ప్రశాంతంగా నిద్రపోయింది.
వెనక్కు తగ్గడంతో...
ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆర్మీ అధికారుల ఇచ్చిన వార్నింగ్ తో పాక్ కొంత వెనక్కు తగ్గినట్లే కనిపించింది. ఒక తూటా వచ్చినా క్షిపణులతో దాడి చేయాలన్న ప్రధాని మోదీ ఆదేశాలతో పాక్ ఇక కాల్పుల విరమణ పాటించాల్సి వచ్చింది. పాక్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ సైన్యం మాత్రం బేఖాతరు చేసిందని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ లో సైనికులదే పెత్తనం కావడంతో కాల్పులు కొనసాగుతాయని అందరూ అంచనా వేశారు. కానీ ఆదివారం రాత్రి మాత్రం పాక్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగలేదు. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ప్రజలు సాధారణ జనజీవనం గడుపుతున్నారు. ఆదివారం రాత్రి సాఫీగానే ముగిసిందని భద్రతాదళాలు చెబుతున్నాయి.
బ్లాక్ అవుట్ ను ఎత్తివేసి...
దీంతో సరిహద్దు రాష్ట్రాలలో బ్లాక్ అవుట్ ను కూడా భద్రతాదళాలు ఎత్తివేశాయి. అయితే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇళ్లు విడిచిన వెళ్లిన వారు తిరిగి అప్పుడే చేరుకోవద్దని ఆదేశాలు జారీ చేశాయి. పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్ కారణంగా ఆ ఇళ్లలో పడిన షెల్స్ ను గుర్తించాలని, వాటిలో రసాయనాలు ఉంటాయని, తాము చెప్పిన తర్వాత మాత్రమే తిరిగి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వ్యాపార దుకాణాలు తెరుచుకున్నాయి. పర్యాటకుల సంఖ్య లేకపోయినప్పటికీ కొంత సాధారణ పరిస్థితి నెలకొందని భద్రతా దళాలు చెబుతున్నాయి. అయినా భద్రతాదళాలు ఉగ్రవాదులు చొరబడకుండా నాకా బందీ సరిహద్దు ప్రాంతాల్లో చేస్తూనే ఉన్నారు.