Sumit Sabharwal : వృద్ధుడయిన తండ్రిని ఒంటరి చేసి.. మాట ఇచ్చి మరీ వెళ్లిపోయిన సుమిత్
అహ్మాదాబాాద్ లో ప్రమాదం జరిగిన విమానం పైలెట్ గా వ్యవహరిస్తున్న సుమిత్ సబర్వాల్ మరణించారు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల మంది మరణించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ. తమ వారిని తలచుకుంటూ బంధువులు, స్నేహితులు రోదిస్తున్నారు. విమాన ప్రమాదంలో దాదాపు 265 మంది మరణించారు. అయితే 787 డ్రీమ్ లైనర్ విమానం పైలెట్ గా వ్యవహరిస్తున్న సుమిత్ సబర్వాల్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. సుమిత్ సబర్వాల్ కుటుంబంలో దాదాపు చాలా మంది ఏవియేషన్ ఫీల్డులో ఉన్నవారే. అందులోనూ సుమిత్ సబర్వాల్ కు విమానం నడపటంలో విశేష అనుభవం ఉంది. సుమిత్ సబర్వాల్ దాదాపు 8,200 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఆయన సొంతం. అలాంటి సుమిత్ సబర్వాల్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది.
ముంబయిలో నివాసం...
సుమిత్ సబర్వాల్ కుటుంబం ముంబయిలో ఉంటుంది. ఆయనకు వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మాత్రమే ఉన్నాడు. ముంబయిలో ఒంటరిగా ఉంటున్న తండ్రి కోసం సుమిత్ సబర్వాల్ ఉద్యోగాన్ని మానేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల తన తండ్రికి కూడా చెప్పాడట. సుమిత్ సబర్వాల్ తండ్రి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో పని చేసి రిటైర్ అయ్యారు. సుమిత్ సబర్వాల్ మేనళ్లులిద్దరూ కూడా పైలెట్లు. ఇలా కుటుంబం మొత్తం ఏవియేషన్ రంగంలోనే ఉంది. తన తండ్రిని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో సుమిత్ సబర్వాల్ ఉద్యోగం మానేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తండ్రితో కూడా చెప్పాడు.
ఉద్యోగం మానేస్తానని...
అందుకు తండ్రి కూడా సంతోషంగా అంగీకరించారని సన్నిహితులు చెబుతున్నారు. సుమిత్ సబర్వాల్ మృతితో వృద్ధాప్యంలో ఆయన తండ్రి ఒంటరి వాడయ్యాడు. కుమారుడు మరణించాడని వార్త తెలిసిన తర్వాత ఆయన షాక్ లోకి వెళ్లాడట. తర్వాత తేరుకుని తన కుమారుడు ఎక్కడంటూ ఆయన విలపిస్తుండటం అందరినీ కలచి వేస్తుంది. ఉద్యోగాన్ని మానేసి తండ్రిని చూసుకోవాలనుకున్న ఆ కుమారుడి కోరిక నెరవేర్చకుండానే తండ్రిని ఒంటరి చేసి వెళ్లపోవడం విధి వక్రీకరించడమే. ఉద్యోగం మానేస్తానన్న కొడుకు ముందుగానే మానేస్తే ప్రాణాలు దక్కేవని ఆ వృద్ధ ప్రాణాలు గిలగిలకొట్టుకుంటున్నాయి. ఆయనను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. చేతికి అందికి వచ్చిన కొడుకు తాను నడిపే విమానంలోనే ప్రాణాలు వదిలాడంటే అంతకంటే పెను విషాదం ఆ కుటుంబానికి ఏముంటుంది?