పహల్గాం దాడి మాస్టర్‌మైండ్ ఆస్తుల స్వాధీనం
లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆస్తిని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి
లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆస్తిని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను దెబ్బతీయడానికి పోలీసు అధికారులు శనివారం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చీఫ్, పహల్గాం దాడి మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజాద్ అహ్మద్ షేక్ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యను అన్‌లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ కింద చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
రెండుకోట్ల విలువైన...
లష్కర్–ఇ–తయిబా కి అనుబంధంగా ఉన్న టీఆర్‌ఎఫ్ సంస్థకు సజాద్ నేతృత్వం వహిస్తున్నాడు. 2022 ఏప్రిల్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ సజాద్ ను ఉగ్రవాదిగా గుర్తించి, అతని తలపై పది లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. ఉగ్రవాదుల మద్దతు వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో భాగంగా, శ్రీనగర్ పోలీసులు హెచ్‌ఎంసీ ప్రాంతంలోని రోజ్ అవెన్యూ వద్ద ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనం విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు.